Supreme Court:ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Send us your feedback to audioarticles@vaarta.com
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కేంద్రం నిర్ణయం సరైనదేనని.. పార్లమెంట్ నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టంచేసింది. జమ్ముకశ్మీర్ భారత్‌లో విలీనం అయినప్పుడు ప్రత్యేక హోదాలు లేవని ప్రకటించింది. కేవలం నాటి ప్రత్యేక పరిస్థితులు, యుద్ధం కారణంగానే ఆర్టికల్ 370 అమలు చేశారని తేల్చిచెప్పింది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ కీలక తీర్పు వెల్లడించింది.
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కొందరు నేతలను ముందస్తుగానే అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమందిని హౌస్ అరెస్ట్‌లు చేశారు. హింస చెలరేగే ప్రమాదం ఉండటంతో గత రెండు వారాలుగా కశ్మీర్ లోయకు భారీ సంఖ్యలో వెళ్లిన పోలీసులు.. అక్కడి 10 జిల్లాలను తమ కంట్రోల్‌లో ఉంచుకున్నారు. ఎవరైనా ప్రజలను రెచ్చగొడితే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించారు. మరోవైపు తీర్పు తమకు వ్యతిరేకంగా వచ్చినా శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలిగించమని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ స్పష్టం చేసింది.
కాగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయాల్లో ఆర్టికల్ 370 రద్దు చేయడం కూడా ఒకటి. ఈ ఆర్టికల్ కారణంగా జమ్మూకశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తి ఉండేది. అయితే 2019లో కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్టికల్‌ను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత రెండు రాష్ట్రాలుగా విడగొట్టి.. వాటిని కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చేసింది. కేంద్రం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్ పార్టీలు సుప్రీంకోర్టు మెట్లెక్కాయి. గత ఆగస్టు 2 నుంచి నెల రోజుల పాటు దీనిపై విచారణ జరగ్గా.. సెప్టెంబర్ 5న తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది. ఇవాళ తుది తీర్పును వెల్లడించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments