Supreme Court:ప్రజాప్రతినిధుల లంచం కేసుల్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

  • IndiaGlitz, [Monday,March 04 2024]

చట్టసభల్లో ఎంపీ, ఎమ్మెల్యేల లంచం కేసుల్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసుల్లో వారికి ఎలాంటి మినహాయింపు లేదని తేల్చిచెప్పింది. పార్లమెంట్‌, అసెంబ్లీలలో ప్రశ్నలు అడిగేందుకు, ప్రసంగించేందుకు, ఓట్లు వేసేందుకు లంచం తీసుకుంటే రక్షణ కల్పించలేమని ఏడుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో 1998లో ఐదుగురు స‌భ్యుల ధ‌ర్మాసనం ఇచ్చిన తీర్పును కూడా కొట్టి వేసింది.

అసలు ఏం జరిగిందంటే..

2012లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా పార్టీకి చెందిన ఎమ్మెల్యే సీతా సోరెన్‌ ఒక పార్టీ అభ్యర్థికి ఓటు వేయడానికి లంచం తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసింది. దీంతో ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఝార్ఖండ్‌ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించడంతో సీతా సోరెన్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై 2019లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.

ఎంపీలు, ఎమ్మెల్యేలు చట్టసభల్లో అవినీతికి పాల్పడినప్పుడు వారిపై చర్యలు తీసుకోవచ్చా? వారికి రక్షణ ఉంటుందా?అనే అంశం ఎంతో ప్రాముఖ్యమైనదని చెబుతూ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసింది. అనంతరం ఈ కేసును చీఫ్‌ జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారించింది. సభలో చేసే ప్రసంగాలు, ఓట్లపై ఎంపీలకు రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుందని పీవీ నరసింహారావు వర్సెస్‌ సీబీఐ కేసులో 1998లో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇందుకోసం ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది.

తాజాగా విచారణ జరిపి కీలక తీర్పు వెలువరించింది. అవినీతికి ప్రజాప్రతినిధులకు రాజ్యాంగ రక్షణ ఉండదని వ్యాఖ్యానించింది. 1998లో ఇచ్చిన తీర్పు రాజ్యాంగంలోని 105, 194 అధికరణలకు విరుద్ధంగా ఉందని పేర్కొంది. లంచం తీసుకోవడం అనే ఆరోపణలు ప్రజాస్వామ్యం విశ్వసనీయతను దెబ్బతీస్తాయని స్పష్టంచేసింది.

కాగా 1993లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రభుత్వం అవిశ్వాసాన్ని ఎదుర్కొంది. అప్పుడు జేఎంఎం ఎంపీలు శిబు సోరెన్‌, మరో నలుగురు ఎంపీలు లంచాలు తీసుకుని అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారనే ఆరోపణలు వచ్చాయి. వీరి ఓట్లతో మైనార్టీలో ఉన్న పీవీ ప్రభుత్వం విజయం సాధించింది. అయితే ఈ ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసింది. దీనిపై 1998లో విచారించిన సుప్రీంకోర్టు ప్రజాప్రతినిధులకు లంచం కేసుల విచారణ నుంచి మినహాయింపునిస్తూ తీర్పు వెలువరించింది.

More News

Prashant Kishore:జగన్‌కు భారీ ఓటమి తప్పదన్న ప్రశాంత్ కిషోర్.. వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం..

వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోతుందని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(Prashant Kishor)

BJP:బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. తెలంగాణ నుంచి బరిలో ఎవరంటే..?

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. మొత్తం 195 అభ్యర్థులతో కూడిన ఈ జాబితాను జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్‌ థావడే విడుదల చేశారు.

Komatireddy Venkatreddy:యాదాద్రి కాదు యాదగిరిగుట్టగా మారుస్తున్నాం.. త్వరలోనే జీవో: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

యాదాద్రి పేరును మళ్లీ యాదగిరిగుట్టగా మారుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ మేరకు త్వరలోనే జీవో జారీ చేస్తామని పేర్కొన్నారు.

Mukesh Ambani: కుమారుడు మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న ముఖేశ్ అంబానీ

బిజినెస్ టైకూన్, అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల ప్రివెడ్డింగ్ గ్రాండ్‌గా జరుగుతున్న సంగతి తెలిసిందే. గుజరాత్‌లోని జామ్ నగర్‌లో న భూతో న భవిష్యతి

YSRCP Manifesto: ఆ వర్గాలే లక్ష్యంగా.. సిద్ధం సభలో వైసీపీ మేనిఫెస్టో ప్రకటన..

వచ్చే ఎన్నికలకు అధికార వైసీపీ సన్నద్ధమవుతోంది. ఇప్పటికే సిద్ధం సభలతో క్యాడర్‌కు దిశానిర్దేశం చేసిన ఆ పార్టీ అధినేత సీఎం జగన్ తాజాగా మేనిఫెస్టోపై కసరత్తును పూర్తి చేసినట్లు తెలుస్తోంది.