ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురు

  • IndiaGlitz, [Monday,August 17 2020]

ఏపీ ప్రభుత్వానికి కోర్టులు కలిసి వస్తున్నట్టు లేదు. దాదాపు ప్రతి కేసులోనూ ఏపీ ప్రభుత్వానికి అపజయమే ఎదురవుతోంది. హైకోర్టును కాదని.. సుప్రీంకోర్టు మెట్లెక్కినా పరిస్థితిలో మాత్రం మార్పు ఉండట్లేదు. తాజాగా ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీ, ఆర్5 జోన్ విషయంలో హైకోర్టు ఇచ్చిన స్టేను దేశ సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. నేడు దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో భాగంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం హైకోర్టు సరిగానే విచారించిందని అభిప్రాయపడింది.

ఇళ్ల స్థలాల జీవో 107పై హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తమ వాదనలను హైకోర్టులోని వినిపించాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రాజధాని మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేస్తూ ఆర్ 5 జోన్‌పై గతంలో ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను హైకోర్టు విచారణ పూర్తయ్యే వరకూ సస్పెండ్ చేసింది. దీంతో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ప్రభుత్వం తాము అనుకున్నది సాధించాలని వడివడిగా అడుగులు వేస్తోంది. కానీ ప్రభుత్వం వేస్తున్న అడుగులకు కోర్టులు బ్రేక్ వేస్తున్నాయి. అయినా సరే ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అధికార వికేంద్రీకరణ బిల్లుపై కూడా హైకోర్టు స్టేటస్ కో విధించింది. నిజానికి ఈ నెల 16న మూడు రాజధానులకు శంకుస్థాపన నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. మరో రెండు నెలల వరకూ ముహూర్తం లేదని కాబట్టి ఈ కార్యక్రమాన్ని 16న నిర్వహించతలపెట్టింది. కానీ హైకోర్టు మాత్రం ఆగస్ట్ 27 వరకూ స్టేటస్ కోను పొడిగించడంతో ప్రభుత్వం సైలెంట్ అయిపోయింది.