అనంత పద్మనాభుని ఆలయ బాధ్యత వారిదే.. వివాదానికి చెక్ పెట్టిన సుప్రీం
- IndiaGlitz, [Monday,July 13 2020]
కేరళలోనే ప్రఖ్యాతి చెందిన అనంత పద్మనాభ స్వామి ఆలయ వివాదానికి సంబంధించిన తుది తీర్పును నేడు సుప్రీంకోర్టు వెలువరించింది. ఆలయ నిర్వహణ బాధ్యతను ట్రావెన్కోర్ రాజవంశానిదేనని తేల్చి చెప్పింది. ప్రస్తుతం అనంత పద్మనాభుని ఆలయంపై ట్రావెన్కోర్ రాజకుటుంబానికున్న హక్కులను సమర్థించడమే కాకుండా తదుపరి నిర్వహణ భాధ్యతలను కూడా వారికే అప్పగించింది. దీంతో తొమ్మిదేళ్లుగా కొనసాగుతున్న వివాదానికి నేటితో సుప్రీంకోర్టు చెక్ పెట్టింది.
అనంత పద్మనాభ స్మామివారి దేవాలయం నేలమాళిగల్లో భారీ నిధి నిక్షేపాలు బయటపడటంతో ఒక్కసారిగా వార్తల్లోకెక్కింది. ఈ నిధులన్నింటినీ ట్రావెన్ కోర్ రాజవంశీయులే కాపాడుకుంటూ వస్తున్నారు. కాగా... దీనిపై ఆలయానికి సంబంధించిన సంపద, నిర్వహణ బాధ్యతలు ట్రావెన్కోర్ రాజవంశీయుల నుంచి స్వాధీనం చేసుకుని, దానికి సంబంధించి ఒక కమిటీ వేయాలని కేరళ హైకోర్టు 2011 జనవరి 31న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ.. ట్రావెన్కోర్ రాజ వంశీయులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన ధర్మాసనం ఏప్రిల్ 2019లో తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. నేడు అనంత పద్మనాభ స్వామి ఆలయ బాధ్యతలను ట్రావెన్కోర్ వంశానికే అప్పగిస్తూ తీర్పును వెలువరించింది.