ఏపీ ప్రభుత్వానికి సుప్రీంలో మరోసారి షాక్..
Send us your feedback to audioarticles@vaarta.com
సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరోసారి షాక్ తగిలింది. మూడు రాజధానుల అంశంపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కోను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీ ప్రభుత్వం పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఎం.ఆర్.షాలతో కూడిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థనను తోసిపుచ్చింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌కో ఉత్తర్వులు ఎత్తేయాలని ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. అయితే ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కోను ఎత్తివేసేందుకు నిరాకరించింది. కనీసం హైకోర్టులో విచారణకు కాల పరిమితి విధించడంపై కూడా తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తెలిపింది.
ఏపీ ప్రభుత్వం తరుఫున రాకేష్ ద్రివేది ఈ కేసును వాదించారు. పరిపాలన రాజధానిని వైజాగ్‌కి మార్చడానికి అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును ద్రివేది కోరారు. పరిపాలనా రాజధానికి సైతం సుప్రీం అనుమతిని నిరాకరించింది. ‘హైకోర్టులో రైతులకు అనుకూలంగా తీర్పు వస్తే.. వైజాగ్‌కు రాజధానిని తరలించే ఖర్చు వృథా కదా?.. ఆ ఖర్చుకు ఎవరు బాధ్యత వహిస్తారు’ అని న్యాయమూర్తి అశోక్ భూషణ్.. ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ కేసును హైకోర్టు త్వరగా పరిష్కరిస్తుందని ఆశిస్తున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది.
రాజధాని పిటిషన్ తొలుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే ధర్మాసనం ముందుకు.. అనంతరం జస్టిస్ ఆర్.ఎఫ్.నారీమన్ ధర్మాసనం ముందుకు వచ్చింది. అయితే సాంకేతిక కారణాల వల్ల ఈ పిటిషన్‌ను మరో ధర్మాసనానికి బదిలీ చేశారు. దీంతో పిటిషన్ నేడు జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. దీంతో ప్రభుత్వ వాదనలు హైకోర్టులోనే వినిపించుకోవాలని అశోక్ భూషణ్ ధర్మాసనం సూచించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments