బాణసంచా వ్యాపారులకు సుప్రీం ఊరట..
- IndiaGlitz, [Friday,November 13 2020]
తెలంగాణ బాణసంచాపై నిషేధం ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు తీర్పును మారుస్తూ సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులను జారీ చేసింది. ఎన్జీటీ తీర్పునకు లోబడి హైకోర్టు ఆదేశాలుండాలని సూచించింది. నవంబర్ 9న బాణసంచా వినియోగంపై ఎన్జీటీ తీర్పు వెలువరించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 16కు వాయిదా వేసింది. కాగా.. వాయుకాలుష్యం తీవ్రత ఎక్కువ ఉన్న నగరాలు, పట్టణాల్లో.. బాణసంచా పూర్తిగా నిషేధించాలని ఎన్జీటీ తెలిపింది.
గాలి నాణ్యత తక్కువ ఉన్న నగరాల్లో టపాసులపై నిషేధం విధించింది. తెలంగాణలో హైదరాబాద్, నల్గొండ, పటాన్చెరు, సంగారెడ్డిలో నిషేధం ఉంది. గాలి నాణ్యత మెరుగ్గా ఉన్న ప్రాంతాల్లో గ్రీన్ క్రాకర్స్‌కు ఎన్జీటీ అనుమతి ఇచ్చింది. కాగా.. దీపావళి రోజు మాత్రమే పర్యావరణ హితమైన బాణసంచాను కాల్చాలని అది కూడా రెండు గంటలు మాత్రమేనని సుప్రీంకోర్టు సూచించింది. ఆ రెండు గంటలను రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించాలని సూచించింది.
కాగా.. క్రాకర్స్ బ్యాన్పై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ హైకోర్టు తీర్పుపై బ్యాన్ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేసింది. దీపావళి పండుగ సందర్భంగా క్రాకర్స్‌ను బ్యాన్ చేస్తూ హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ కోరింది. ఇప్పటికే షాపులలో స్టాకులను నింపామని అసోసియేషన్ పిటిషన్లో తెలిపింది. పండుగ రెండు రోజుల ముందు బ్యాన్ విధిస్తే తాము కోట్లల్లో నష్టపోతామని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు.. హైకోర్టు ఉత్తర్వులను సవరించి.. బాణసంచా వ్యాపారులకు సుప్రీం ఊరట కల్పించింది.