కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై సుప్రీం తీవ్ర అసంతృప్తి
- IndiaGlitz, [Monday,April 15 2019]
కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సుప్రీంకోర్టు.. ఈసీపై కన్నెర్రజేసింది. ఇందుకు సంబంధించి రేపు అనగా మంగళవారం కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని సీఈసీకి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. విధుల నిర్వహణలో ఈసీ నిర్లక్ష్యం కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీఎస్పీ అధినేత్రి మాయావతిలు మతపరమైన వ్యాఖ్యలు చేశారంటూ కోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా.. కోడ్ అమలు చేయడంలో ఈసీ పనితీరుపై దృష్టిసారించిన కోర్టు ఎన్నికల అధికారుల వివరణ కోరింది. దీనిపై ఈసీ సమాధానం ఇస్తూ నేతల వ్యాఖ్యలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని కోర్టుకు తెలిపింది. కాగా.. మాయావతికి నోటీసులు జారీ చేశామని, ఈ నెల 12కల్లా ఆమె సమాధానం పంపాల్సిందని.. కానీ ఆమె నుంచి ఇంకా సమాధానం రాలేదని ఎన్నికల సంఘం తరపు లాయర్ కోర్టు దృష్టికి తెచ్చారు. మరి మీరు ఏం చేయదలిచారు..? అంటూ కోర్టు ప్రశ్నించింది. ఇందుకు బదులిస్తూ.. పార్టీ గుర్తింపు తాము రద్దు చేయలేమని, అలాగే ఆమెను అనర్హురాలిగా ప్రకటించలేమని.. కేవలం సూచనలు సలహాలు ఇవ్వడమే తమ పని అని లాయర్ స్పష్టం చేశారు. ఈ సమాధానానికి సంతృప్తి చెందని కోర్ట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై సమగ్ర విచారణ చేస్తామని రేపు ఉదయం మళ్ళీ కేసు విచారిస్తామని పేర్కొంది. ఈసీ తరపున పూర్తి వివరాలతో ఓ అధికారిని కోర్టుకు పంపాలని ఆదేశించింది. కాగా.. రేపు ఈసీ తరపు న్యాయవాది.. సుప్రీంకోర్టుకు ఏమని సమాధానమిస్తారా..? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.