జర్నలిస్టుల కోసం సుప్రీంకోర్టు ప్రత్యేక యాప్
- IndiaGlitz, [Friday,May 14 2021]
కరోనా మహమ్మారి దేశంలో ప్రవేశించిన అనంతరం కార్యక్రమాలన్నీ ఆన్‌లైన్‌కు షిఫ్ట్ అయిపోయిన విషయం తెలిసిందే. చదువులు, సమావేశాలు, ఆఫీస్ వర్క్ అన్నీ ఆన్‌లైన్‌లో నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు సైతం వర్చువల్ విధానంలో విచారణలు నిర్వహిస్తోంది. కాగా.. జర్నలిస్టుల కోసం తాజాగా ఓ ప్రత్యేక యాప్‌ను సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ ప్రారంభించారు. యాప్ ప్రారంభం అనంతరం ఆయన మాట్లాడుతూ.. జస్టిస్ కన్విల్‌కర్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ధనుంజయ్‌ల కమిటీ ఈ యాప్‌నకు రూపకల్పన చేసినట్లు తెలిపారు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే సుప్రీంకోర్టు సాంకేతిక బృందం దీన్ని రూపొందించినట్లు ఎన్‌వీ రమణ వెల్లడించారు.
Also Read: అరేబియాలో సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం.. తుపాను అలర్ట్
సుప్రీంకోర్టు రోజువారీ కార్యకలాపాలను జర్నలిస్టులు ఇకపై ఉన్న చోటు నుంచే రిపోర్ట్ చేసేందుకు ఈ అవకాశం కల్పించామన్నారు. కోర్టులో జరిగే కార్యకలాపాలు పారదర్శకంగా ఉండేందుకుగాను సాంకేతికంగా ముందుకెళ్లాలని భావించినట్లు ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత వినియోగంలోకి తీసుకురానున్నట్లు చెప్పారు. గతంలోను ఓ జర్నలిస్టుగా బస్సులో తిరుగుతూ వార్తలు సేకరించిన రోజులు గుర్తున్నాయని సీజేఐ ఈ సందర్భంగా అన్నారు. సుప్రీంకోర్టు విచారణలను జర్నలిస్టులకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి సుప్రీంకోర్టు ఇ-కమిటీ చొరవతో ఈ యాప్‌ని విడుదలు చేస్తున్నామని ఎన్.వి రమణ తెలిపారు.
కోర్టు విచారణలు ప్రత్యక్ష ప్రసారం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తామని ఆయన అన్నారు. కోర్టు ప్రత్యక్ష కార్యకలాపాలను ప్రసారం చేసేలా ఓ ట్రయల్ ప్రతిపాదనను కూడా సుప్రీంకోర్టు పరిశీలిస్తోందన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కోర్టు విచారణలను పలువురు జర్నలిస్టులు వర్చువల్ ద్వారా జరపాలని కోరిన తరువాత యాప్‌ను రూపొందించారు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల ఈ యాప్ కోసం గూగుల్ ప్లే స్టోర్‌లోని యాప్ ద్వారా విచారణలను ప్రత్యక్షంగా హాజరయ్యే వీలు కల్పించనున్నారు. కాగా.. కొవిడ్ బారిన పడి మృతిచెందిన న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బందికి జస్టిస్ ఎన్.వి.రమణ, ఇతర న్యాయమూర్తులు సంతాపం తెలిపారు.