సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి చుక్కెదురు..
- IndiaGlitz, [Friday,July 17 2020]
సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి చుక్కెదురైంది. తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ జీవన్‌రెడ్డి గత నెల 29న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని జీవన్‌రెడ్డి కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు విచారించిన జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్.కె కౌల్, జస్టిస్ ఎం.ఆర్ షాతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను కొట్టేసింది. సచివాలయ కూల్చివేత అంశంపై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేబినెట్ నిర్ణయాన్ని తప్పుబట్టలేమని పేర్కొంది.
సుప్రీం తీర్పుతో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. రూ.500 కోట్ల వ్యయంతో నూతన సచివాలయ భవనాన్ని నిర్మించాలని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తోంది. శ్రావణ మాసంలో నిర్మాణ పనులను ప్రారంభించే యోచనలో సర్కారు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే సచివాలయం కూల్చివేతను ప్రభుత్వం ప్రారంభించింది. అయితే ఇటీవల సచివాలయ భవన నిర్మాణాల కూల్చివేతను నిరసిస్తూ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు కూల్చివేతపై స్టేను ఎప్పటికప్పుడు పొడిగిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో హైకోర్టు స్టేను నిలిపివేస్తుందో.. కొనసాగిస్తుందో వేచి చూడాలి.