ఆర్జీవీ అంత తొందరెందుకు.. ఆగ్రహించిన సుప్రీం!
- IndiaGlitz, [Monday,April 01 2019]
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు తెరకెక్కించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీ ఆంధ్రప్రదేశ్‌లో రిలీజ్‌కు హైకోర్టు స్టే ఇవ్వడంతో అత్యవసర విచారణకు నిర్మాత రాకేశ్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సోమవారం మధ్యాహ్నం ఈ పిటిషన్ విచారణకు రాగా ఆర్జీవీకి సుప్రీంకోర్టు షాకిచ్చింది.
అత్యవసర విచారణ చేయాల్సిన అవసరం లేదని.. అయినా అంత తొందరెందుకు అని నిర్మాత, డైరెక్టర్‌కు కోర్టు చీవాట్లు పెట్టింది. అనంతరం చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఈ పిటిషన్‌ను డిస్‌మిస్ చేశారు.
అంతేకాదు ఏప్రిల్ 3న హైకోర్టు నిర్ణయం తీసుకునే వరకూ ఎందుకు ఆగరు? అని సదరు నిర్మాత లాయర్‌ను గొగోయ్ ప్రశ్నించారు. తుది నిర్ణయం హైకోర్టే ఈ విషయంలో తీసుకుంటుందని.. అక్కడ వ్యతిరేక నిర్ణయం వస్తే అప్పుడు సుప్రీంను ఆశ్రయించాలంటూ గొగోయ్ తేల్చిచెప్పారు.
అయితే ఎల్లుండి హైకోర్టు సినిమా చూసిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా..? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు ఏపీ తప్ప మిగిలిన అన్ని చోట్ల రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అని అభిమానులు, సినీ ప్రియుల నుంచి మన్ననలు పొందుతోంది. అయితే ఏపీలో కూడా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా త్వరలోనే విడుదలవుతుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ఏపీలో అసలు రిలీజ్ అవుతోందో..? లేదో వేచి చూడాల్సిందే మరి.