Lal Salaam Teaser: 'లాల్ సలాం' టీజర్‌లో మొయిద్దీన్ భాయ్‌గా దుమ్మురేపిన రజనీకాంత్
- IndiaGlitz, [Monday,November 13 2023]
సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల 'జైలర్' మూవీతో సూపర్ హిట్ అందుకుని అభిమానులను అలరించారు. తాజాగా ఆయన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కిన 'లాల్ సలాం' సినిమాలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. దీపావళి కానుకగా ఈ చిత్ర టీజర్‌ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వంగా ప్రజలు నివసిస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో కొందరు స్వార్థ రాజకీయాలతో కులాలు, మతాల మధ్య గొడవలు పెడుతుంటారు. అలాంటి నాయకుల ఆట కట్టించి దేశాన్ని కాపాడిన మొయిద్దీన్ భాయ్ పాత్రలో రజినీ నటించారు.
భారత్‌లో ఎంతో ఆదరణ ఉన్న క్రికెట్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కినట్లు టీజర్‌లో చూపించారు. ఆ క్రికెట్ ముసుగులో హిందూ, ముస్లిం యువకుల మధ్య చెలరేగిన గొడవలను మొయిద్దీన్ భాయ్ ఎలా సర్దుబాటు చేశారనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. టీజర్‌ను గమనిస్తే ముంబై వంటి సెన్సిటివ్ ప్రాంతంలో హిందువులు, ముస్లింలు మధ్య ఘర్షణలు జరిగినప్పుడు జరిగిన నష్టం ఏంటి? క్రికెట్‌ను ఎంతగానో ప్రేమించే ఇద్దరు యువకులు.. వారిలో ఒకరు హిందు, మరొకరు ముస్లిం. ఇద్దరి మనసుల్లో మతపూరిత ద్వేషం ఉండటంతో క్రికెట్ ఆటలో ఒకరిపై ఒకరు పోటీ పడే సన్నివేశాలు చూపించారు.
అలాగే హిందు, ముస్లింలు గొడవ పడుతున్నప్పుడు మొయిద్దీన్ భాయ్ ఆ ప్రాంతంలో శాంతి కోసం ఏం చేశారనే కథాంశంతో ‘లాల్ సలాం’ రూపొందిందని టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. ఎప్పటిలాగానే సూపర్ స్టార్ రజినీకాంత్ తనదైన స్టైలింగ్ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకోనున్నారు. విష్ణు విశాల్, విక్రాంత్ యువ క్రికెటర్స్‌గా అలరించబోతున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.
అగ్ర హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించటంతో పాటు డిఫరెంట్ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రాధాన్యతనిస్తూ రూపొందిస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ 'లాల్ సలామ్’ చిత్రాన్ని నిర్మించింది. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో జీవితా రాజశేఖర్, క్రికెట్ లెంజెండ్ కపిల్ దేవ్ నటించడం విశేషం. ఈ టీజర్‌తో సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
సాంకేతిక నిపుణులు:
బ్యానర్: లైకా ప్రొడక్షన్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఐశ్వర్య రజినీకాంత్, నిర్మాత: సుభాస్కరన్, సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, సినిమాటోగ్రఫీ: విష్ణు రంగస్వామి, ఎడిటింగ్: బి.ప్రవీణ్ భాస్కర్, లైకా ప్రొడక్షన్స్ హెడ్: జి.కె.ఎం.తమిళ్ కుమరన్, ఆర్ట్: రాము తంగరాజ్, స్టైలిష్ట్: సత్య ఎన్.జె, స్టంట్స్: అనల్ అరసు, కిక్కాస్ కాళి, స్టంట్ విక్కీ, స్టోరి: విష్ణు రంగస్వామి పబ్లిసిటీ డిజైనర్: శివమ్ సి.కబిలన్, పి.ఆర్.ఒ (తెలుగు): నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా).