Rajinikanth:ఎన్టీఆర్‌లా మేకప్ వేసుకున్నా.. నా ఫ్రెండ్ కోతిలా వున్నానని అన్నాడు, 2024లో చంద్రబాబు గెలిస్తే : రజనీ ఆసక్తికర వ్యాఖ్యలు

  • IndiaGlitz, [Saturday,April 29 2023]

ఎన్టీఆర్‌ను స్పూర్తిగా తీసుకునే తాను సినిమాల్లోకి వచ్చినట్లు తెలిపారు సూపర్‌స్టార్ రజనీకాంత్. శుక్రవారం విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో తలైవా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి వచ్చే నాటికి ఎన్టీఆర్ పారితోషికం సినిమాకు రూ.10 లక్షలని, 40 ఏళ్ల కిందట పది లక్షలంటే ఇప్పుడు ఎన్ని కోట్లని ప్రశ్నించారు. కానీ అలాంటి జీవితాన్ని వదిలేసి ఎన్టీఆర్ ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారని రజనీ కొనియాడారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి సంచలనం సృష్టించారని.. ఆయనో యుగపురుషుడని ప్రశంసించారు తలైవా.

నా జీవితంపై ఎన్టీఆర్ ప్రభావం:

తనకు ఆరేళ్ల వయసున్నప్పుడు పాతాళభైరవి సినిమా చూశానని.. అందులోని 20 అడుగుల ఎత్తయిన బైరవి విగ్రహం తన మనస్సులో నిలిచిపోయిందని రజనీ చెప్పారు. తన తొలి సినిమా పేరు కూడా భైరవినేనని.. కెమెరా ముందు మొదటిగా చెప్పిన డైలాగ్ కూడా భైరవి ఇల్లు ఇదేనా అని అంటూ సూపర్‌స్టార్ గుర్తుచేశారు. ఓసారి ఎన్టీఆర్‌ను చూడటానికి వెళ్తే తనను ఎవరో ఎత్తుకుని ఎన్టీఆర్‌ను చూపించారని ఆయన అన్నారు. తన జీవితంపై ఎన్టీఆర్ ప్రభావం చాలా వుందని.. తాను బస్ కండక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు గద పట్టుకుని ఎన్టీఆర్‌ను అనుకరించేవాడినని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ సమయంలోనే కురుక్షేత్రం నాటకంలో పాల్గొన్నానని అప్పుడు తన మిత్రులు తనను సినిమాల్లోకి వెళితే మంచి నటుడివి అవుతావని చెప్పారని రజనీ గుర్తుచేసుకున్నారు. ఇక దానవీర శూరకర్ణలో ఎన్టీఆర్ గెటప్‌లో తాను రెడీ అయి మిత్రుడికి చూపిస్తే.. అచ్చం కోతిలా వున్నావంటూ కామెంట్ చేశారని తలైవా చెప్పారు.

క్రమశిక్షణ, గౌరవం ఇవ్వడం ఎన్టీఆర్ నుంచే నేర్చుకున్నా :

ఎన్టీఆర్‌తో కలిసి రెండు సినిమాల్లో కలిసి నటించానని.. ఆయనను చూసే క్రమశిక్షణ, నిర్మాతలకు గౌరవం ఇవ్వడం నేర్చుకున్నానని రజనీ వెల్లడించారు. షూటింగ్ ఉంటే 6.45 గంటలకే ఆయన సిద్ధంగా వుండేవారని .. అది వ్యక్తిత్వానికి ఆయన ఇచ్చే మర్యాద అని ప్రశంసించారు. ఎన్టీఆర్‌ది గొప్ప వ్యక్తిత్వమని.. దేశ రాజకీయాల్లో మహామహులను ధీటుగా ఎదుర్కొన్నారని ఆయన ప్రశంసించారు. ఎన్టీఆర్ , ఎంజీఆర్‌లకు మేకప్ మెన్ అయిన పీతాంబరాన్ని దుర్యోధనుడి వేషం కోసం మేకప్ వేయమంటే.. ఆయన వేయనన్నారని రజనీకాంత్ గుర్తుచేసుకున్నారు. 1982లో బొబ్బిలిపులి షూటింగ్ సమయంలోనే తెలుగుదేశం పార్టీని స్థాపించారని.. ఈ సినిమాలో రెండు పేజీల డైలాగ్‌ను సింగిల్ టేక్‌లో పూర్తి చేశారని రజనీ చెప్పారు. ఎన్టీఆర్, శివాజీ, రాజ్ కుమార్ వంటి దిగ్గజాలతో గడిపే అవకాశం తనకు లభించిందని ఆయన పేర్కొన్నారు.

హైదరాబాద్ అభివృద్ధి చంద్రబాబు వల్లే:

చంద్రబాబు తనకు 30 ఏళ్లుగా తెలుసునని.. తన స్నేహితుడు మోహన్ బాబు పరిచయం చేశారని రజనీ గుర్తుచేశారు. హైదరాబాద్‌కు వచ్చిన ప్రతీసారి తాను చంద్రబాబును కలిసేవాడినని.. రోజుకు 24 గంటలూ ప్రజలకు మంచి చేయాలనే ఆయన ఆలోచించేవారని రజనీ ప్రశంసించారు. విజన్ 2020 గురించి 1996 టైమ్‌లోనే చెప్పారని.. హైదరాబాద్‌ను హైటెక్ సిటీగా మార్చారని.. లక్షలాది మంది తెలుగువారు ఐటీ ఉద్యోగులుగా మారారంటే అందుకు చంద్రబాబే కారణమని అన్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌ వైపు వెళ్తుంటే.. ఇండియాలో వున్నానా, న్యూయార్క్‌లో వున్నానా అన్నది అర్ధం కాలేదన్నారు. తన పుట్టినరోజు నాడు ఖచ్చితంగా చంద్రబాబు ఫోన్ చేసి విషెస్ తెలియజేస్తారని రజనీకాంత్ చెప్పారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే ఏపీ దేశంలోనే నెంబర్‌వన్ అవుతుందని ఆయన ఆకాంక్షించారు.

More News

Samantha:సమంత స్టంట్స్ చూశారా.. సూపర్‌ ఉమెన్‌ లుక్‌లో సామ్, ఆ దెబ్బకు ప్రత్యర్థులు చిత్తే

సమంత.. ఈ పేరు తెలియని వారుండరు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు సామ్.

Heavy Rain HYD:హైదరాబాద్‌లో దంచికొట్టిన భారీ వర్షం : కొట్టుకుపోయిన బైకులు, కార్లు.. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్

హైదరాబాద్‌ను భారీ వర్షం వణికించింది. శనివారం పొద్దుపొద్దున్నే నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

Shirdi:సాయి భక్తులకు అలర్ట్ .. షిర్డీలో మే 1 నుంచి నిరవధిక బంద్, ఎందుకంటే..?

షిర్డీ సాయి భక్తులకు షాకింగ్ న్యూస్. షిర్డీ గ్రామస్తులు మే 1 నుంచి నిరవధిక బంద్ పాటించాలని నిర్ణయించారు.

RC16:చరణ్- బుచ్చిబాబు మూవీ .. అది కోడి రామ్మూర్తి బయోపిక్ కాదు, క్లారిటీ ఇచ్చిన చెర్రీ టీమ్

టాలీవుడ్‌లో దర్శకుల పరిస్ధితి విచిత్రంగా వుంటుంది. సాధారణంగా ఫ్లాప్‌లు ఇచ్చిన దర్శకులకు మరో ఆఫర్ రావడం కష్టం.

Producer Abhishek Agarwal:నిర్మాతలను గౌరవించేది ఇలాగేనా.. ఫిల్మ్ ఫేర్ నిర్వాహకులపై ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ ఆగ్రహం

68వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వేడుకలు వివాదాస్పదమవుతున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘‘ది కాశ్మీర్ ఫైల్స్’’ చిత్రానికి ఫిల్మ్ ఫేర్ అవార్డ్ దక్కగా..