రజినీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం
- IndiaGlitz, [Thursday,April 01 2021]
అగ్రకథానాయకుడు, సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు అరుదైన గౌరవం దక్కింది. గురువారం ఉదయం కేంద్రం ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించింది. 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆయనకు ఇస్తున్నట్లు తాజాగా కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ ప్రకటించారు. భారతీయ చలన చిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే పేరుతో సినీ రంగంలో విశేష సేవలు అందించిన వారికి 1969 నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారం ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు రజినీకాంత్‌కు ఈ పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది.
దాదాసాహెబ్ పురస్కారం అందుకున్న దక్షిణాది వారిలో ఎక్కువగా తెలుగు వారే ఉండటం విశేషం. దక్షిణాదికి చెందిన బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (తెలుగు), ఎల్వీ ప్రసాద్ (తెలుగు), నాగిరెడ్డి(తెలుగు), అక్కినేని నాగేశ్వరరావు(తెలుగు), శివాజీ గణేషన్(తమిళం), రామానాయుడు(తెలుగు), బాలచందర్(తెలుగు, తమిళం), కె. విశ్వనాథ్(తెలుగు), ఇక కన్నడ నుంచి రాజ్‌కుమార్, మలయాళం నుంచి గోపాలకృష్ణన్ ఈ పురస్కారాన్ని అందుకున్నవారిలో ఉన్నారు. ఇటీవల కాలంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్‌ను కూడా ఈ పురస్కారం వరించిన విషయం తెలిసిందే.