తేల్చి చెప్పేసిన రజనీకాంత్.. మక్కల్ మండ్రం రద్దు!

సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రాబోతున్నారు అంటూ వస్తున్న ఊహాగానాలపై కుండబద్దలు కొట్టేశారు. సోమవారం రోజు రజనీకాంత్ పోయెస్ గార్డెన్ లోని తన నివాసంలో అభిమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాను రాజకీయాల్లోకి రావడం లేదనే విషయాన్ని అభిమానులకు తేల్చి చెప్పేశారు.

గతంలోనే రజని ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ.. తిరిగి రజని రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలు వినిపించాయి. దీనితో అభిమానుల్లో అసలు రజని రాజకీయాల్లోకి వస్తారా రారా అనే గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో రజనీకాంత్ సోమవారం పూర్తి క్లారిటీ ఇచ్చేశారు. గతంలో రజని రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఆరోగ్య కారణాల రీత్యా ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు.

రజనీకాంత్ సోమవారం చెన్నైలో తన అభిమానులు, మక్కల్ మండ్రం నిర్వాహకులతో సమావేశం అయ్యారు. భవిషత్తులో నేను రాజకీయాల్లోకి వస్తానా రానా అని అభిమానులు అడుగుతున్నారు. నేను రాజకీయాల్లోకి రావడం లేదు. మక్కల్ మండ్రంని కూడా రద్దు చేస్తున్నట్లు రజని ప్రకటించారు. దానిని రజని అభిమాన సంక్షేమ మండ్రంగా మార్చుతున్నట్లు తెలిపారు.

ఇటీవల సాధారణ వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లి వచ్చానని రజని అన్నారు. కరోనా పరిస్థితులు, షూటింగ్స్ బిజీ వల్ల కొంత కాలంగా అభిమానులని సరిగ్గా కలుసుకోలేదు. అందుకే ఈ రోజు వారితో సమావేశం అయ్యానని రజని అన్నారు. ఈ సమావేశంతో తన విషయంలో రాజకీయ ప్రస్తావన రాకుండా రజని క్లారిటీ ఇచ్చేశారు.

రజనీకాంత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో 'అన్నాత్తే' చిత్రంలో నటిస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.