మనం సైతంకు సూపర్ స్టార్ కృష్ణ దంపతుల విరాళం...
Send us your feedback to audioarticles@vaarta.com
పేదలే ఆప్తులుగా వసుధైక కుటుంబంగా సాగుతున్న సేవా సంస్థ మనం సైతంలో నేనూ ఉన్నానంటూ ముందుకొచ్చారు సూపర్ స్టార్ కృష్ణ. ఆయన సతీమణి గిన్నీస్ బుక్ రికార్డ్స్ హోల్డర్ దర్శకురాలు విజయనిర్మలతో కలిసి సూపర్ స్టార్ కృష్ణ మనం సైతంకు విరాళం అందజేశారు.
కృష్ణ, విజయ నిర్మల చెరో 2 లక్షల రూపాయలు మనం సైతంకు అందజేశారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్లానెట్ 10లో గల కృష్ణ స్వగృహంలో మనం సైతం సభ్యులు కృష్ణ దంపతులను కలిశారు. ఈ సందర్భంగా ఐదుగురు ఆపన్నులకు మనం సైతం ఆర్థిక సహాయం అందించింది.
లైట్ మెన్ ప్రవీణ్ కుమార్, చిరుద్యోగి ఎస్ రాజేందర్, ప్రసాద్ ల్యాబ్స్ లో పనిచేసే బాయ్ దుర్గారావు, ఆంధ్రజ్యోతిలో సబ్ ఎడిటర్ గా పనిచేసే రాజ్ కుమార్ కొడుకు సోమేశ్వర్, రచయిత ప్రాణమిత్ర తదితరులు ఆర్థిక సహాయం పొందిన వాళ్లలో ఉన్నారు. వీళ్లలో కొందరికి అనారోగ్య చికిత్సకు, మరికొందరు చదువులకు ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా కృష్ణ , విజయ నిర్మల మాట్లాడుతూ....కాదంబరి కిరణ్ మనం సైతంతో మంచి సేవా కార్యక్రమం చేస్తున్నారు. నటుడిగా కొనసాగుతూ ఆయన సేవా కార్యక్రమాల్లో భాగమవడం సంతోషంగా ఉంది. అనారోగ్యంతో ఉన్నవాళ్లకు, చదువులు భారమైన పేదలకు మనం సైతం అండగా నిలబడుతోంది. ఈ సంస్థకు మా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుంది. అన్నారు. కాదంబరి కిరణ్ మాట్లాడుతూ...మా అమ్మ విజయ నిర్మల, పెద్దలు సూపర్ స్టార్ కృష్ణ గారు మనం సైతం కుటుబంలో భాగమై మా అందరికీ నీడగా మారినందుకు వాళ్లకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.
గతంలో కేటీఆర్ చేతుల మీదుగా మా సంస్థ వెబ్ సైట్ ప్రారంభించాము. ఆ వెబ్ సైట్ వల్ల విదేశాల్లో ఉన్న దాతలు స్పందించారు. కిరణ్ కర్నాటీ, వెంకట్ సంఘీ, రామ్ నామగిరి లాంటి ఎన్ఆర్ఐలు మనం సైతంకు విరాళాలు పంపిస్తున్నారు. మనం సైతంకు పరిశ్రమ పెద్దలు, పాత్రికేయులు, రాజకీయ రంగ ప్రముఖులు, ప్రభుత్వ పెద్దలు అండగా నిలబడుతుండటం మాకెంతో ధైర్యాన్నిస్తోంది.
నన్ను నిత్యం వెన్నంటి ప్రోత్సహిస్తున్న మనం సైతం సహచరులకు కృతజ్ఞతలు. పేదవాడే నా కుటుంబం, పేదలకు ఆసరాగా నిలబడటమే నా జీవిత లక్ష్యమని నిర్ణయించుకున్నాను. మనం సైతం తీసుకునేవాళ్లకు బాగా చేరువవుతోంది. అలాగే దాతలకు కూడా చేరాలని కోరుకుంటున్నాను. అన్నారు.
ఈ కార్యక్రమంలో మనం సైతం సభ్యులు బందరు బాబీ, వల్లభనేని అనిల్, వినోద్ బాలా, హాస్య నటుడు రచ్చరవి తదితరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments