వైఎస్ జగన్‌కు సడన్ షాకిచ్చిన సూపర్‌స్టార్ ఫ్యామిలీ..!
- IndiaGlitz, [Tuesday,January 08 2019]
వైసీపీకి మహేష్ బాబు అభిమానులు దూరం కానున్నారా...? ఒకప్పుడు వైసీపీకి అండగా ఉన్న ఫ్యాన్స్ ఇప్పుడు తప్పని పరిస్థితిలో టీడీపీకి సపోర్ట్ చేయాల్సి వస్తుందా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇది అక్షరాలా నిజమనిపిస్తోంది. ఇక విషయానికొస్తే.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేకర్ రెడ్డి- సూపర్ స్టార్ కృష్ణ కుటుంబానికి చాలా అనుబంధం ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. వైఎస్ మీదున్న అభిమానంతో హీరో కృష్ణ సోదరడు, ప్రముఖ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరి రావు వైసీపీలో చేరి.. పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ వస్తున్నారు. అయితే కొన్నేళ్లుగా పార్టీలో పనిచేస్తున్నప్పటికీ ఆయనకు ఎలాంటి గుర్తింపు లేదు.. కనీసం చిన్నపాటి పదవి కూడా నోచుకోకపోవడంతో ఇక వైసీపీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు.
అందరితో చర్చించాకే రాజీనామా..!
ఈ విషయమై సూపర్‌స్టార్ అభిమాన సంఘం నాయకులు, తన కుటుంబీకులతో చర్చించిన ఆయన రాజీనామా చేయాలనే కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం సాయంత్రం వైసీపీ రాజీనామా చేస్తున్నట్లు ఆదిశేషగిరి రావు ప్రకటించారు. తన ఇంటి అల్లుడు ఎంపీ గల్లా జయదేవ్ ఉన్న టీడీపీ తీర్థం పుచ్చుకోవాలని నిర్ణయించేసుకున్నారు. ఆయన ఎందుకు రాజీనామా చేయబోతున్నారనేందుకు మాత్రం కారణాలు తెలియరాలేదు. ఆదిశేషగిరి రావు ఇలా సడన్‌గా రాజీనామా చేస్తున్నట్లు తెలియడంతో అటు వైఎస్ జగన్.. ఇటు వైసీపీ కార్యకర్తలు, మహేశ్ అభిమానులు, అనుచరులు విస్మయానికి గురయ్యారు. అసలేం జరుగుతోందో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
బుజ్జగింపులు కూడా అయిపోయాయ్..!
రాజీనామా చేస్తున్నట్లు విషయం తెలుసుకున్న వైసీపీ అధినేత పార్టీలోని ఒకరిద్దరి కీలక నేతలతో ఆదిశేషగిరి రావుతో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయన సుముఖత చూపలేదని సమాచారం. రాజీనామా చేయడానికి నిర్ణయించాక ఇక వెనకడుగేయడం సరైనది కాదని.. తప్పకుండా అనుకున్నది చేయాల్సిందేనని ఆయన అనుకుంటున్నారట. అయితే ఎన్టీఆర్, మెగా అభిమానులు అంటే సూపర్‌స్టార్ అభిమానులకు పడదు.. ఇలాంటి తరుణంలో అభిమానులు ఎలా రియాక్టవుతారనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
చక్రం తిప్పిందెవరు..!?
అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే వైసీపీకి రాజీనామా చేసి సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఎప్పట్నుంచో వైసీపీలో ఉన్న ఆయన్ను రాజీనామా దాకా తీసుకెళ్లింది ఎవరు..? ఘట్టమనేని ఫ్యామిలీని మెప్పించెదవరు..? అనే విషయాలు ఆరా తీయగా.. ఈ వ్యవహారం వెనకున్నది గల్లా జయదేవ్ అని తెలియవచ్చింది. చంద్రబాబు డైరక్షన్‌లో ఇదంతా జరిగిందని.. ఇప్పటికే బీజేపీ, జనసేనను పోగొట్టుకున్న తమకు మహేశ్ అభిమానులు తోడయితే కాసింత లాభం చేకూరే అవకాశం ఉందని తెలుసుకుని గల్లా జయదేవ్‌ను రంగంలోకి దింపారట. సుధీర్ఘ మంతనాలు, సీటు హామీ మేరకు ఘట్టమనేని ఫ్యామిలీ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆదిశేషగిరి రావు ఎక్కడ్నుంచి పోటీ చేస్తారు..? ఎంపీగా పోటీ చేస్తారా లేకుంటే ఎమ్మెల్యేగానే పోటీ చేస్తారా అనే విషయాలు తెలియరాలేదు.