‘‘అన్నాత్తే’’ టెక్నీషియన్లకు రజనీ సర్ప్రైజ్ గిఫ్ట్.. ఇంటికి పిలిపించి మరి
- IndiaGlitz, [Thursday,December 23 2021]
సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'అన్నాత్తే' చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తమిళంలో భారీ వసూళ్లు సాధించి రజనీ కెరీర్లో మరో హిట్‌గా నిలిచిపోయింది. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఖుష్బూ, మీనా, కీర్తి సురేశ్, నయనతార కీలక పాత్రలు పోషించారు. ‘‘అన్నాత్తే’’ను తెలుగులో పెద్దన్న పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. కాగా, 'అన్నాత్తే' చిత్రానికి పనిచేసిన టెక్నీషియన్లకు సూపర్‌స్టార్ రజనీకాంత్ బంగారు గొలుసులు బహూకరించారు. వారిని తన నివాసానికి ఆహ్వానించిన రజనీకాంత్... వారికి ఈ కానుకను అందజేశారు.
మరోవైపు అన్నాత్తే రిలీజ్ తర్వాత రజనీకాంత్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటన్న దానిపై క్లారిటీ రాలేదు. కార్తీక్ సుబ్బరాజు, వెంకట్ ప్రభు, కేఎస్ రవికుమార్ వంటి దర్శకులు రజనీకి కథలు వినిపించారని కోలీవుడ్ టాక్. తాజాగా ఈ జాబితాలో ‘చీనీ కమ్’, ‘పా’, ‘ప్యాడ్మాన్’ వంటి హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆర్. బాల్కీ పేరు తెరపైకి వచ్చింది. ఆయన ఇటీవల రజనీని కలిసి ఓ కథను వినిపించారని.. అది సూపర్‌స్టార్‌కు బాగా నచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
రజనీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలని మేకర్స్ అనుకుంటున్నారట. ఇక ఈ కాంబినేషన్లో మరో విశేషం కూడా వుంది. బాల్కీ తెరకెక్కించిన వాటిలో చీనీ కమ్, పా, షమితాబ్ తదితర చిత్రాలకు మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. ఒకవేళ రజనీ – బాల్కీ కాంబినేషన్ సెట్ అయితే.. ఈ సినిమాకు కూడా ఇళయరాజానే స్వరాలు సమకూర్చే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. 1994లో చివరిగా రజనీ నటించిన ‘వీర’ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. మరి దాదాపు పాతికేళ్ల తర్వాత ఈ కాంబినేషన్ కుదురుతుందా? అసలు రజనీ–బాల్కీ కాంబినేషన్ సెట్ అయ్యిందా ..? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.