Indira Devi: సూపర్‌స్టార్ కృష్ణ ఇంట్లో మరో విషాదం... మహేశ్ తల్లి ఇందిరా దేవి కన్నుమూత
Send us your feedback to audioarticles@vaarta.com
రెబల్‌స్టార్ కృష్ణంరాజు మరణం నుంచి ఇంకా కోలుకోకముందే టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి ఇందిరా దేవి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఇందిరా దేవి వయసు 70 సంవత్సరాలు. ఆమె మరణంతో కృష్ణ కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. ఈ ఏడాది జనవరిలో కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్ బాబు అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీని నుంచి ఆ కుటుంబం ఇంకా కోలుకోకముందే ఇందిరా దేవి సైతం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం వారిని తీవ్రంగా బాధిస్తోంది. ఆమె మరణవార్త తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు కృష్ణ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో ఇందిరా దేవి అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటి వరకు అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం పద్మాలయ స్టూడియోలో ఇందిరా దేవి పార్థివ దేహాన్ని ఉంచుతారు.
కృష్ణ స్టార్ కాకముందే ఇందిరతో వివాహం :
1961లో ఇందిరా దేవిని కృష్ణ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఐదుగురు సంతానం. రమేశ్ బాబు, మహేశ్ బాబు, పద్మావతి, మంజుల , ప్రియదర్శిని. కృష్ణ నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రమేశ్ బాబు కొద్దికాలం పాటు హీరోగా పలు సినిమాలు చేసి తర్వాత నిర్మాతగా మారారు. రెండవ కుమారుడు మహేశ్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ అగ్రనటుల్లో ఒకరు. పెద్ద కుమార్తె పద్మావతి టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ సతీమణి. మరో కుమార్తె మంజుల నటన, నిర్మాణం, దర్శకత్వం చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. చిన్న కుమార్తె ప్రియదర్శిని హీరో సుధీర్ బాబు సతీమణి. అయితే కృష్ణ స్టార్‌గా ఎదుగుతున్న సమయంలో తన సహ నటి విజయ నిర్మలను ద్వితీయ వివాహం చేసుకున్నారు. అయితే ఆమె కూడా 2019లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. విజయ నిర్మల, రమేశ్ బాబు, ఇందిరా దేవిల వరుస మరణాలతో సూపర్‌స్టార్ కృష్ణకు కోలుకోలేని దెబ్బ తగిలినట్లయ్యింది. ఐదేళ్ల క్రితం శ్రీశ్రీ చిత్రంలో నటించిన తర్వాత కృష్ణ సినిమాలకు దూరంగా వుంటూనే వస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments