నా గ‌త చిత్రాల‌న్నింటి కంటే కృష్ణాష్ట‌మి ప్రేక్ష‌కుల‌కు ఎక్కువ సంతృప్తి క‌లిగిస్తుంది ఇది నిజం. - హీరో సునీల్

  • IndiaGlitz, [Thursday,February 18 2016]

అందాల రాముడు, పూల రంగ‌డు, మిస్ట‌ర్ పెళ్లికొడుకు, భీమ‌వ‌రం బుల్లోడు...చిత్రాల్లో న‌టించిన క‌మెడియ‌న్ ట‌ర్న‌డ్ హీరో సునీల్. వాసు వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో సునీల్ న‌టించిన తాజా చిత్రం కృష్ణాష్ట‌మి. దిల్ రాజు ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై నిర్మించారు. ఈ నెల 19న కృష్ణాష్ట‌మి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ఈ సంద‌ర్భంగా కృష్ణాష్ట‌మి గురించి హీరో సునీల్ తో ఇంట‌ర్ వ్యూ మీకోసం...

కృష్ణాష్ట‌మి టైటిల్ జ‌స్టిఫికేష‌న్ ఏమిటి..?

కృష్ణాష్ట‌మి...ఏదో టైటిల్ బాగుంద‌ని ఈ టైటిల్ పెట్ట‌లేదు. ఈ సినిమాలో కృష్ణాష్ట‌మి టైటిల్ కి జ‌స్టిఫికేష‌న్ ఉంటుంది. ఈ సినిమాలో హీరో పుట్టింది కృష్ణాష్ట‌మి రోజునే..అలాగే హీరో లైఫ్ లో బిగ్గెస్ట్ ఇన్సిడెంట్ జ‌రిగింది కృష్ణాష్ట‌మి రోజునే. అలాగే హీరో లైఫ్ లో కన్ క్లూజ‌న్ వ‌చ్చేది ఆ కృష్ణాష్ట‌మి రోజునే. అందుచేత ఈ మూవీకి కృష్ణాష్ట‌మి క‌రెక్ట్ టైటిల్. జ‌స్టిఫికేష‌న్ లేక‌పోయినా ఈ టైటిల్ ఇష్టం.

ఈ సినిమాలో మీ క్యారెక్ట‌ర్ ఎలా ఉంటుంది..?

ఓ పెద్ద హీరో చేయ‌వ‌ల‌సిన క్యారెక్ట‌రైజేష‌న్ ని నాకు ఇచ్చారండి. త‌డాఖా లో ఫ‌స్టాఫ్ పిరికిత‌నం ఉన్న పోలీసాఫీస‌ర్ గా చేసాను. సెకండాఫ్ ధైర్యం ఉన్న‌పోలీసాఫీస‌ర్ గా చేసాను. ధైర్యం ఉన్న పోలీసాఫీర్ గా చేసిన‌ప్పుడు వేరే హీరోలా చేయ‌లేదు. సిన్సియ‌ర్ పోలీసాఫీర్ ఎలా చేస్తాడో అలా చేసాను అంతే. త‌డాఖా లో నా క్యారెక్ట‌ర్ ను ఆడియోన్స్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇక కృష్ణాష్ట‌మి లో నా క్యారెక్ట‌ర్ విష‌యానికి వ‌స్తే..ఇందులో ఫుల్ ఫ‌న్ ఉంటుంది. కాక‌పోతే వీడిలో డిగ్నిటి ఉంటుంది. ప‌క్క‌వాళ్ల స‌మ‌స్య‌ల గురించి ఎక్కువ ఆలోచించే టైపు. ఈ విధంగా నా క్యారెక్ట‌ర్ ఉంటుంది.

కృష్ణాష్ట‌మి దిల్ రాజు నిర్మాత కావ‌డం వ‌ల‌న ఓకే చేసారా..? క‌థ న‌చ్చి ఓకే చేసారా..?

దిల్ రాజు గారు నిర్మాత కాక ముందు నుంచి నాకు ఫ్రెండ్. ఆయ‌న ఏ సినిమా తీస్తున్నా నాకు క‌థ చెప్పి నా అభిప్రాయం తెలుసుకుంటారు. దిల్ రాజు గారి శ్రీ వెంక‌టేశ్వ‌ర బ్యాన‌ర్ లో క‌మెడియ‌న్ గా చేసాను. ఇప్పుడు దిల్ రాజు గారి బ్యాన‌ర్ లో హీరోగా చేయ‌డం నా ఎఛీవ్ మెంట్ గా ఫీల‌వుతున్నాను. భ‌గ‌వంతుడు నాకు ఇచ్చిన వ‌రం ఇది. ఓరోజు దిల్ రాజు గారు పిలిచి క‌థ చెప్పి...ఇది పెద్ద హీరోకి అనుకున్నాం. క‌థ‌లో కొన్ని మార్పులు చేసి నీతో చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నాను. అలాగే పెద్ద హీరోతో చేస్తే 70 కోట్లు బ‌డ్జెట్ అవుతుంది. ఇదే క‌థ‌తో సునీల్ తో చేస్తే ఎలా ఉంటుంది అని మా ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రికీ క‌థ చెప్పాను. అంద‌రూ సునీల్ తో చేస్తే బాగుంటుంది అన్నారు అని చెప్ప‌గానే...నా క్యారెక్టర్ కి క‌ష్ట‌ప‌డి నేను న్యాయం చేస్తాను. నాపై ఎంత బ‌డ్జెట్ వ‌ర్క‌వుట్ అవుతుంది అలాంటిది నాకు తెలియ‌దు సార్. నాకు క‌థ కూడా చెప్ప‌న‌వ‌స‌రం లేదు సార్. ఏరోజు వ‌చ్చి ప‌ని చేయ‌మంటారో చెప్పండి ఆరోజు వ‌చ్చి పని చేస్తాను అని చెప్పాను.

కృష్ణాష్ట‌మిలో సునీల్ లుక్ కొత్త‌గా ఉంది. కార‌ణం ఎవ‌రు...మీరా..? డైరెక్ట‌ర్ వాసు వ‌ర్మా..?

నేను చిరంజీవి గారి అభిమానిని. ఆయ‌న స్పూర్తితోనే ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చాను. ఇప్పుడున్న లుక్ అందరికీ కొత్త కానీ..నాకు పాత. ఇంటర్మిమీడియ‌ట్, డిగ్రీ, ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన కొత్త‌లో... గ‌డ్డంతో ఉన్న ఈ లుక్కే ఉండేది. ఒకే రూమ్ లో ఉన్నాం కాబ‌ట్టి త్రివిక్ర‌మ్ గార్కి తెలుసు. ఆత‌ర్వాత వినాయ‌క్ గారు కో డైరెక్ట‌ర్ గా ఉన్న టైంలో న‌న్ను ఈ లుక్ లో చూసారు. ఇద్ద‌రం క‌లుస్తుండే వాళ్లం. అలాగే డైరెక్ట‌ర్స్ ఇ నివాస్, యోగేష్..ల‌కు కూడా ఈ లుక్ తెలుసు. నాకు గ్యాంగ్ లీడ‌ర్ లో చిరంజీవి గారి లుక్ అంటే చాలా ఇష్టం. అందుచేత ఇలా గెడ్డంతో ఉన్నప్పుడు ఫోటోస్ తీసుకుని దాచుకున్నాను. ఆ ఫోటోల‌ను సెల్ ఫోన్ లో పెట్టుకున్నాను. వాసు వ‌ర్మ ఆ ఫోటోస్ చూసి నాకు ఈ లుక్ కావాల‌న్నారు. ఈ సినిమాలో నేను యు.ఎస్ లో ఉంటాడ‌న్నారు. క్యారెక్ట‌ర్ డిగ్నిఫైడ్ గా ఉంటుంది అన్నారు క‌దా అంటే...క్యారెక్ట‌ర్ కి ప‌ర్స‌న‌ల్ ఇంట్ర‌స్ట్ కి సంబంధం లేదన్నారు. అలాగే దిల్ రాజు గారు, శిరీష్, ల‌క్ష్మ‌ణ్ కూడా ఈ లుక్కే కావాల‌న్నారు. ఆ విధంగా ఈ లుక్ వ‌చ్చింది.

ఈ సంస్థ‌లో క‌మెడియ‌న్ గా చేసారు. ఇప్పుడు క‌థానాయ‌కుడుగా చేసారు. ఈ సంస్థ‌లో తేడా ఏమైనా క‌నిపించిందా..?

అప్ప‌టికీ ఇప్ప‌టికీ ఈ సంస్థ‌లో ఎలాంటి తేడా లేదండి. రాజు గారు ఎదుటి వ్య‌క్తి అభిప్రాయానికి గౌర‌వం ఇస్తారు. ఎవ‌రైనా ఇది బాగోలేదంటే..ఎందుకు బాగోలేదో చెప్ప‌మంటారు. అది క‌నుక క‌రెక్ట్ గా ఉంద‌నిపిస్తే ఆయ‌న నిర్ణ‌యాన్ని మార్చుకుంటారు. ఇది చాలా గొప్ప ల‌క్ష‌ణం. అది అంద‌రిలో ఉండ‌దు. అందుకే దిల్ రాజు గారంటే నాకు చాలా ఇష్టం.

క‌మెడియ‌న్ సునీల్ - హీరో సునీల్ అయ్యాడు...ఆ ఛేంజ్ గుర్తు చేసుకుంటే మీకు ఏమ‌నిపిస్తుంది..?

క‌మెడియ‌న్ గా చేసిన‌ప్పుడు రెస్పాన్స‌బులిటి లేదండి. కాక‌పోతే టెన్ష‌న్. ఇంత‌కీ ఎందుకు టెన్ష‌న్ అంటే....ఒకే రోజు రెండు మూడు సినిమాల్లో న‌టించాల్సి వ‌స్తుంది. అప్పుడు చాలా టెన్స‌న్ గా ఉంటుంది. ఆ టెన్ష‌న్ లేక‌పోతే ఇంకా బాగా న‌వ్వించే వాడిని. భ‌యం - భ‌క్తే నా స‌క్సెస్ కి కార‌ణం అని నా ఫీలింగండి. భ‌యం అంటే అంద‌రూ అనుకునే భ‌యం కాదండి నా ప్రొఫేష‌న్ అంటే భ‌యం. ఆ భ‌యం లేక‌పోతే సిక్స్ ప్యాక్ చేసేవాడిని కాదు. క‌మెడియ‌న్ గా చేసిన‌ప్పుడు అయితే నా సీన్ వ‌ర‌కు చూసుకునేవాడిని. హీరో గా చేస్తున్న‌ప్పుడు నేను లేని సీన్ తీస్తున్నా...ఎలా తీస్తున్నారో ద‌గ్గ‌రుండి చూసుకోవాలి. లేక‌పోతే సినిమా ఏమైపోతుందో అనే టెన్ష‌న్ ఉంది.

హీరోగా ఎలాంటి సినిమాలు చేయాలి అనుకుంటున్నారు..?

ప‌దిమందిని న‌వ్వించాలి అనేది నా ముఖ్య ఉద్దేశ్యం. అలాగే ఏదో ఒక లైన్ అయినా మంచి చెప్పాలి అనుకుంటాను. అలాంటి సినిమాలు చేయాలి అనుకుంటున్నాను.

ఇండ‌స్ట్రీలో ప్ర‌వేశించిన రోజుల్లో ఎక్కువుగా ఇప్పుడున్న ద‌ర్శ‌కుల‌తో గ‌డిపేవారు. కానీ...ఆ డైరెక్ట‌ర్స్ తో ఇప్ప‌టి వ‌ర‌కు సినిమా చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం..?

నాకు వాళ్ల‌తో సినిమాలు చేయాల‌ని ఉంటుంది. కాక‌పోతే ఫ్రెండ్ షిప్ వేరు..ప్రొఫెష‌న్ వేరు. అందుకే ఫ్రెండ్ షిప్ నిల‌బ‌డింది అనుకుంటాను. ఆ డైరెక్ట‌ర్స్ వాళ్లను ప‌ట్టుబ‌ట్టి మరీ సినిమా చేయ‌మంటున్నార‌ని కొంత మంది గురించి నాతో చెప్పుకుంటుంటారు. అలాంటిది నేను కూడా ప‌ట్టుబట్టి సినిమా చేయమంటే ఎలా..? అని ఆలోచిస్తుంటాను. నాకు ఫ‌లానా డైరెక్ట‌ర్ తో సినిమా చేయాల‌నే ఫీలింగ్ వ‌స్తే...నిరాహార దీక్ష చేసైనా స‌రే సినిమా చేయించేసుకుంటాను.

2015లో మీ తోటి క‌మెడియ‌న్స్ కొంత మంది మ‌న‌ల్ని వ‌దిలేసి వెళ్లిపోయారు...వాళ్ల‌ను గుర్తుచేసుకుంటే ఏమ‌నిపిస్తుంది..?

వాళ్ళంద‌రితో నాకు మంచి స్నేహం - అనుబంధం ఉంది. నేను సెట్ లోకి వ‌చ్చిన త‌ర్వాత ఈరోజు ఎం.ఎస్ గారి కాంబినేష‌న్ తో సీన్ అంటే చాలా సంతోష‌డేవాడ్ని. ఎందుకంటే ఆయ‌న చాలా మంచి రైట‌ర్, మంచి ఆర్టిస్ట్. ఆయ‌న‌తో న‌టించేట‌ప్పుడు మ‌నం క‌న‌ప‌డ‌మేమో అని భ‌య‌మేస్తుంటుంది. ఆయ‌న‌ది భీమ‌వ‌రమే. సినిమాల్లోకి రాక ముందు న‌న్ను సినిమాల్లోకి తీసుకెళ్లండి అని ఆయ‌నికి ఓ లెట‌ర్ రాసాను. ఆయ‌న లేక‌పోవ‌డం నాకు చాలా పెద్ద‌లోటు. ఇప్ప‌టికీ ఆయ‌న లేరంటే న‌మ్మ‌బుద్ది కావ‌డం లేదు.

కమెడియ‌న్స్ చూస్తే చాలు సామాన్యుల‌కు న‌వ్వువ‌స్తుంది. అలా మీరు ఎవ‌ర్ని చూసి న‌వ్వేవారు..?

బ్ర‌హ్మానందం గార్ని చూస్తే చాలు తెగ న‌వ్వేసేవాడ్ని. ఆయ‌న‌తో ఓసారి అన్నాను..సార్ నాది విల‌న్ ఫేసు...ఈ ఫేసుతో ఎలా న‌వ్వించాలని. అది ఇప్ప‌టికీ ఆయ‌న గుర్తు చేస్తుంటారు. సిన్సియార్టి ఉన్న వాళ్ల‌ను ఎంక‌రేజ్ చేస్తానురా...నువ్వు బాగా క‌ష్ట‌ప‌డ‌తావ్..నెక్ట్స్ నువ్వు అది చేయాలి ఇది చేయాలి అని న‌న్ను ఎంత‌గానో ప్రొత్స‌హించేవారు బ్ర‌హ్మానందం గారు.

ఇప్పుడున్న హీరోలు ఐదు పాట‌ల‌కు డాన్స్ చేయ‌డం అంటే క‌ష్టం. ఏదో ఓ పాట‌కు డాన్స్ చేస్తే చాలు అనుకుంటున్నారు..కానీ మీరు ఐదు పాట‌ల‌కు డాన్స్ చేస్తున్నారు...కార‌ణం..?

మ‌న‌కు వ‌ర్క్ ఎక్కువుగా ఉంటే బాబోయ్ రెస్ట్ కావాలంటాం...రెస్ట్ ఎక్కువుగా ఉంటే వ‌ర్క్ కావాలంటాం. మ‌న‌కు ఏది లేదో దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాం త‌ప్పా ఏది ఉందో దాన్ని త‌క్కువ ఎంజాయ్ చేస్తాం. నేను పాటకు త‌గ్గ‌ట్టు డాన్స్ చేస్తాను. కానీ పాట‌కున్న లిమిట్ దాటి డాన్స్ చేసేయాలి అనిపిస్తుంటుంది. ఎందుకంటే నాకు డాన్స్ అంటే పిచ్చి. ఈ సినిమాలో డాన్స్ విష‌యానికి వ‌స్తే...డాన్స్ ల్లో నీ క‌ష్టం క‌న‌ప‌డ‌కూడ‌దు. ఇష్టం క‌న‌ప‌డాలి అన్నాడు వాసు వ‌ర్మ‌. అలాగే పాట‌కు త‌గ్గ‌ట్టు డాన్స్ చేసాను.

మీరు చేసిన సినిమాల్లో మీ ఫ్యామిలీ మెంబ‌ర్స్ కి బాగా న‌చ్చిన సినిమా..?

ఫ్యామిలీ మెంబ‌ర్స్ కి నేను ఏ సినిమా చేసినా న‌చ్చుతుంది. కాక‌పోతే ఎక్కువుగా మ‌న్మ‌ధుడు సినిమా అంటే బాగా ఇష్టం. అందులో బంకు శీను క్యారెక్ట‌ర్ అంటే బాగా ఇష్టం.

ఇప్పుడు అంతా సోష‌ల్ మీడియాలో ఉంటున్నారు క‌దా..? మీరు సోష‌ల్ మీడియాలో ఉన్నారా..?

చిన్న‌ప్ప‌టి నుంచి నాకు ఎంట‌ర్ టైన్ చేయాలని ఉంది కానీ నా గురించి నేను ఎక్కువ చెప్పుకోవాలి అని లేదు. దానికి తోడు చదువుకున్న‌ది అంతా తెలుగులోనే చ‌దివాను. ఇంగ్లీషు, హిందీ మేనేజ్ చేయ‌గ‌ల‌ను. ట్విట్ట‌ర్ లో ఎకౌంట్ నేను ఎప్పుడో స్టార్ట్ చేసాను. అలా స్టార్ట్ చేసానో లేదో ప‌ది వేల మంది ఫాలోవ‌ర్స్ వ‌చ్చేసారు. అయితే చిరంజీవి గారి పుట్టిన‌రోజు నాడు ఆయ‌న‌కి విషెస్ ట్విట్ట‌ర్ లో చెప్ప‌లేద‌ని న‌న్ను చిరంజీవి గారి ఫ్యాన్ కాద‌న్నాడు ఎవ‌రో ట్విట్ట‌ర్ లో. అప్పుడు ఆయ‌న‌కు చిరంజీవి గారు ట్విట్ట‌ర్ లో లేరు..ఇంటి ద‌గ్గ‌ర ఉన్నారు ఇంటికెళ్లి విషెస్ చెప్పేసి వ‌చ్చాను అని ట్విట్ట‌ర్ లో చెప్పాను. అప్ప‌టి నుంచి ట్విట్ట‌ర్ ఆన్ చేయ‌డం మానేసాను.

బాహుబ‌లి సినిమాతో తెలుగు సినిమా ప‌రిధి పెరిగింది. హీరోగా మీ మార్కెట్ ను పెంచుకువాల‌నే ఆలోచ‌న ఉందా..?

నిజంగా చెప్పాలంటే మ‌నం ప్లాన్ చేసి పెంచుకుంటే మార్కెట్ పెర‌గ‌దండి. మ‌నం చేసిన సినిమా అంద‌రికీ న‌చ్చేస్తే ఆటోమేటిక్ గా నా మార్కెట్ పెరుగుతుంది.

కృష్ణాష్ట‌మి ఆడియోన్స్ కు ఎలాంటి సంతృప్తి క‌లిగిస్తుంది..?

నా గ‌త చిత్రాల‌న్నింటి కంటే కృష్ణాష్ట‌మి ప్రేక్ష‌కుల‌కు ఎక్కువ సంతృప్తి క‌లిగిస్తుంది. ఇది నిజం.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..

వంశీ ఆకెళ్ల ద‌ర్శ‌క‌త్వంలో మూవీ చేస్తున్నాను. యాభై శాతం షూటింగ్ పూర్త‌య్యింది. అలాగే వీరుపోట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న వీడు గోల్డ్ ఎహే న‌ల‌భై శాతం షూటింగ్ పూర్త‌య్యింది.