పోలీసులు, మీడియాతో ఆటలా సందీప్, ప్రియదర్శి!

  • IndiaGlitz, [Tuesday,July 09 2019]

టాలీవుడ్ కమెడియన్‌ కమ్ హీరోగా రాణిస్తున్న ప్రియదర్శి బుల్లెట్‌ వాహనం మిస్సయ్యిందన్న వ్యవహారం ఇటు మీడియాలో అటు సోషల్ మీడియాలో పెద్దఎత్తున హడావుడి జరిగిన సంగతి తెలిసిందే. సోమవారం నాడు బైక్‌ ఇంటి ముందు పార్క్ చేసి ఉండగా.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారని ప్రియదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు చేసిన విషయాన్ని తన ట్విట్టర్ వేదికగా ప్రియదర్శి చెప్పుకొచ్చాడు. అయితే ప్రియ‌ద‌ర్శి త‌న ట్విట్ట‌ర్‌లో ఎవ‌రో అన్‌ఫ్రొఫెష‌న‌ల్ దొంగ అంటూ ఓ వీడియో చేసి పెద్ద హంగామానే చేశాడు. మరోవైపు ఆయన ట్విట్టర్ ఫాలోవర్స్ కొందరు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని హైదరాబాద్ పోలీసులకు ట్విట్టర్‌లో ట్యాగ్ చేయగా మరింత సీరియస్‌గా మారింది.

పోలీసులు రంగంలోకి దిగే సరికి..!

పోలీసులు రంగంలోకి దిగి లొకేషన్ ఎక్కడో చెప్పాలని ట్విట్టర్‌లో కోరారు. దీంతో కంగుతిన్న ప్రియదర్శి ఏం చేయాలో దిక్కుతోచక ఈ వ్యవహారం సీరియస్‌ అయితే ఎందాకా వెళ్తుందో ఏమోనని వెంటనే తాను పోస్ట్ చేసిన ట్వీట్‌ను తొలగించేశాడు. ఇందుకు వెంటనే ‘నిను వీడని నేనే’ హీరో సందీప్ కిషన్ రియాక్ట్ అయ్యాడు. ఈ సందర్భంగా పోలీసులకు సందీప్ క్షమాపణలు చెప్పాడు. ఈ మొత్తం వ్యవహారం సినిమా ప్రమోషన్‌లో భాగంగా చేశారట. దీంతో అటు పోలీసులు, ఇటు నెటిజన్లు, సినీ ప్రియులు ప్రియదర్శి-సందీప్‌ల వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మీడియా, పోలీసులంటే లెక్కలేదా!?

ట్విట్టర్‌లో మనం ఏం హంగామా చేసినా దాన్ని వార్తగా రాసేస్తారని.. ప్రియదర్శి, సందీప్ అనుకున్నారా..? హడావుడి చేసి అటు పోలీసులను సైతం ఇబ్బంది పెడతారా..? నాన్న పులి కథలా.. ఆటాడుతున్నారా అంటూ మీడియా మిత్రులు, పోలీసులు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా అబద్ధమే అనుకుందాం.. రేపొద్దున నిజంగానే బైకో లేదా ఇంకోటో పోతే పరిస్థితేంటి..? అప్పుడు ఫిర్యాదు చేస్తే మిమ్మల్ని ఏ విధంగా చూస్తారు..? మీ వార్తలు మీడియా మిత్రులు ఎలా రాస్తారు..? అనేది తెలుసుకోవాల్సి ఉంది. ఒకసారి క్రెడిబిలిటి పోతే మళ్లీ మళ్లీ తిరిగొస్తుందా..? జనాలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఉంటుందా..? ఏదైనా ఒక పనిచేసేముందు ఇలాంటివి ఒకటికి పదిసార్లు ఆలోచించి ముందుచూపుతో చేస్తే మంచిదని మీడియా మిత్రులు, సినీ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు.

ఒక్కసారి గతంలోకి వెళ్లండి సార్లూ..!

మీడియా, పోలీసులతో ఆటాడుకోవాలన్న కొందరు హీరోల పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా మీడియాకే వార్నింగ్ ఇచ్చిన ఓ హీరో ఆ తర్వాత ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి కొన్నేళ్లు పట్టింది. సో.. ప్రమోషన్స్ ముఖ్యమా..? క్రెడిబిలిటీ ముఖ్యమా..? ఇక్కడ పాయింట్.. మున్ముంధు అయినా ఇలాంటి వాటికి దూరంగా మంచిది మరి.