ఏపీలో పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
- IndiaGlitz, [Tuesday,April 02 2024]
ఏపీలోని పాఠశాలలకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు సెలవులు కొనసాగనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ అధికారక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 23 నాటికి అన్ని తరగతుల విద్యార్థులకు పరీక్షలు పూర్తి చేసి.. ఏప్రిల్ 24 నుంచి సెలవులు ఇవ్వనున్నారు. ప్రస్తుతం మార్చి 18 నుంచి ఒంటిపూట బడులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఒంటిపూట ఒడులు నిర్వహిస్తున్నారు.
గతేడాది మే 1న పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభంకాగా జూన్ 12న తిరిగి తెరచుకున్నాయి. అయితే ఈ ఏడాది రాష్ట్రంలో ఎండల తీవ్రత కారణంగా ఏప్రిల్ 24 నుంచే పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. గతేడాది కంటే ఈసారి సమ్మర్ హాలీడేస్ ఎక్కువగా ఉండనున్నాయి. మరోవైపు పాఠశాల విద్యార్థులకు ఏప్రిల్ 6 నుంచి సమ్మెటివ్ అసెస్‌మెంట్(SA)-2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూలును పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 6 నుంచి 19 వరకు పరీక్షలు జరగనున్నాయి.
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే 9వ తరగతి విద్యార్థులకు మాత్రం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు జరపనున్నారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే షెడ్యూలులో మార్పులుంటాయని విద్యాశాఖ తెలిపింది. ఏప్రిల్ 6 నుంచి 16 వరకు 1-5వ తరగతి విద్యార్థులకు.. ఏప్రిల్ 6 నుంచి 18 వరకు 6-8వ తరగతి విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి.