ట్రైలర్ రివ్యూ: సుమ జయమ్మ పంచాయతీ

  • IndiaGlitz, [Saturday,April 16 2022]

సుమ కనకాల... తెలుగు నాట పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. స్టార్ యాంకర్‌గా దశాబ్ధాలుగా తెలుగు బుల్లితెరను మహారాణిగా ఏలుతున్నారామె. అంతేకాదు... ఎంత పెద్ద స్టార్ హీరో కార్యక్రమమైనా సుమ లేకుండా జరగదు. అంతటి పాపులర్ అయిన ఈ యాంకరమ్మకు సినిమాల్లో ఎన్నో ఆఫర్లు వచ్చాయి. అత్తమామలు స్వయంగా ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ నిర్వాహకులు కాగా.. భర్త రాజీవ్ కనకాల మంచి నటుడు. కుటుంబానికి ఈ స్థాయిలో సినిమా నేపథ్యం వున్నా.. ఫిల్మ్ నగర్‌లో మంచి పలుకుబడి వున్నా, సుమ ఎప్పుడు సినిమాల వైపు చూడలేదు. అయితే ఇన్నాళ్లకు ఎందుకో ఆమెకు సినిమాల మీదకు మనసు మళ్లింది.

ఎన్నో ఏళ్ల త‌రువాత‌.. ముఖానికి మేక‌ప్ వేసుకుంది. సుమ ప్ర‌ధాన పాత్ర పోషించిన చిత్రం ‘‘జ‌య‌మ్మ పంచాయితీ’’. ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. మే 6న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. తాజాగా శనివారం ఈ సినిమా ట్రైల‌ర్ రిలీజ్ చేశారు.

“రా బావా… మా ఊరి పంచాయితీ చూద్దువు గానీ… ఏ ఊర్లో లేని ఎరైటీ గొడ‌వ జ‌రుగుతోంది..“ అనే డైలాగ్‌తో ట్రైల‌ర్ మొద‌లైంది. ట్రైల‌ర్ మొత్తం పంచాయితీ, దాని గొడ‌వ చుట్టూ తిరిగినట్లు అనిపిస్తుంది. అయితే సమస్య ఏమిట‌న్న‌ది మాత్రం ఎక్కడా రివీల్ చేయలేదు. ఓ ప‌ల్లెటూరు, అక్క‌డి విచిత్ర‌మైన మ‌నుషులు, ప్రేమ క‌థ‌లు, వాళ్ల స‌మ‌స్య‌లూ ముఖ్యంగా పంచాయితీ.. వాటి మ‌ధ్య‌నే కథ తిర‌గ‌బోతోంద‌న్న విష‌యం ట్రైల‌ర్ చూస్తే అర్ధమవుతుంది. సుమ డైలాగ్ డెలివ‌రీ, త‌న యాస‌.. ఆక‌ట్టుకున్నాయి. విజ‌య్ కుమార్ కాలివ‌ర‌పు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి బ‌లంల ప్ర‌కాష్ నిర్మాత‌. సుమ మినహా దాదాపు అంతా కొత్త వాళ్ళతోనే ఈ సినిమా తెరకెక్కుతోంది.