‘పుష్ప’ లో యాంకర్ సుమ నటించడంపై క్లారిటీ..!
- IndiaGlitz, [Wednesday,May 27 2020]
టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బన్నీ.. క్రియేటివ్ హెడ్‌గా పేరుగాంచిన సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఇప్పటికే బన్నీ బర్త్‌డే సందర్భంగా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. కరోనా మహమ్మారి విలయ తాండవం లేకుంటే ఈ పాటికే సినిమా షూటింగ్ 70% పైగా అయిపోయేది. కానీ.. కరోనా ఎఫెక్ట్‌తో చిత్రబృందం ఇంటికే పరిమితం అయ్యింది. ఈ క్రమంలో ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చూసుకుంటోంది. తెలుగుతో పాటు పలు భాషల్లో ‘పాన్ ఇండియా’గా వస్తున్న ఈ చిత్రం కోసం భారీగానే మైత్రీ మూవీ మేకర్స్ ఖర్చు పెడుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ రూమర్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.
నిజమే అనుకున్నారు కానీ..
ఈ చిత్రంలో బన్నీకి అక్కగా టాప్ యాంకర్ సుమ కనకాల నటిస్తోందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇది చూసిన నెటిజన్లు, సినీ ప్రియులు ఇదేంటి.. ఎప్పుడూ షోలతో బిజిబిజీగా ఉండే సుమ.. సినిమాల్లో నటించడమేంటి..? అని అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పటికే నాలుగైదు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్‌గా చేసిన విషయం విదితమే. అయితే తాజాగా కూడా పాత్ర మంచిది కావడం.. సినిమాల్లో నటించి కూడా చాలా రోజులవ్వడంతో ఇది కరెక్టేనేమో అందరూ భావించారు.
అవన్నీ పుకార్లే..
ఈ వార్తపై చిత్రయూనిట్ స్పందిస్తూ.. అవన్నీ అవాస్తవాలే.. పుకార్లు నమ్మకండి అని క్లారిటీ ఇచ్చుకుంది. అసలు ఇలాంటి రూమర్స్ ఎవరు పుట్టించారో తెలియట్లేదని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. కాగా హాట్ యాంకర్ అనసూయ కూడా ఇందులో ముఖ్యపాత్రలో నటిస్తోందని వార్తలు వచ్చాయ్ కానీ.. ఈ వార్తలపై మాత్రం సినిమా యూనిట్ రియాక్ట్ కాలేదు. సో.. అనసూయ ఇందులో నటిస్తోందన్న మాట.