కమర్షియల్ ఫార్ములా సినిమాలకు ఫ్యాన్స్ వున్నారు. కాబట్టే స్టార్లు సిన్మాలు తీస్తున్నారు. ఫార్ములా ఫిల్మ్స్‌తో ఓ ప్రాబ్లమ్ వుంది. ఏమాత్రం ఇంట్రెస్టింగ్‌గా లేకపోయినా రొటీన్ అని కామెంట్స్ ఎదుర్కొవాల్సి వస్తుంది. కంటెంట్ కామన్‌గా సినిమాల్లో చూసేది అన్పించినా, కరెక్ట్‌గా చెప్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. కొత్త కంటెంట్ అయితే కమర్షియల్ సక్సెస్ ఇస్తారు. ట్రైలర్‌లో వందతలల రావణుడు, కౌరవుల పక్కన కృష్ణుడు వుంటే, వగైరా వగైరా పాయింట్స్‌తో క్యూరియాసిటీ క్రియేట్ చేసిన కార్తి ‘సుల్తాన్’ ఎలా వుంది? సినిమాలో మ్యాటర్ వుందా? లేదా? రివ్యూలో చూద్దాం.
కథ:
సుల్తాన్ అలియాస్ విక్రమ్ (కార్తి) రోబోటిక్ ఇంజినీర్. ముంబైలో ఉంటాడు. అతడికి తల్లి లేదు. బిడ్డకు జన్మనిచ్చి మరణిస్తుంది. విశాఖలో అతడి తండ్రి (నెపోలియన్)ది రౌడీ నేపథ్యం. ఆయన దగ్గర వందమంది రౌడీలు వుంటారు. అందులో మన్సూర్ (లాల్) మెయిన్. ఆయనే హీరోకి సుల్తాన్ అని పెట్టింది. మన్సూర్, మిగతా రౌడీ గ్యాంగ్ చేతుల్లో సుల్తాన్ పెరుగుతాడు. విశాఖలో వారం ఉందామని వచ్చిన సుల్తాన్‌కు ఊహించని ఘటన ఎదురవుతుంది. ఇంటి మీద జరిగిన ఎటాక్‌లో తండ్రిని కోల్పోతాడు. తర్వాత అన్నలు అని పిలుచుకొనే రౌడీలతో అమరావతిలోని వెలగపూడి గ్రామానికి వెళతాడు. కత్తులు పక్కనపెట్టి పలుగు, పార పట్టుకుని వ్యవసాయం చేయమంటాడు. వెలగపూడి వెళ్ళడానికి, వ్యవసాయం చేయడానికి కారణం ఏంటి? కత్తులు పక్కన పెట్టమన్న సుల్తాన్ కత్తి పట్టడానికి కారణం ఏంటి? రుక్మిణి (రష్మిక)తో పరిచయం వల్ల అతడిలో వచ్చిన మార్పు ఏంటి? అనేది మిగతా సినిమా.
ఎనాలసిస్:
‘సుల్తాన్’ సినిమా ప్రారంభంలో, మధ్యలో, ముగింపులో తెలుగు సినిమాలు గుర్తుకు వస్తే ప్రేక్షకులది తప్ప కాదు. తెలుగు సిన్మాలను మిక్సీలో వేసి కథ రెడీ చేశారనే సందేహం కలుగుతుంది. కమర్షియల్ ఫార్ములాను విడవకుండా దర్శకుడు సినిమాను తెరకెక్కించడంతో ఆ టైపు సినిమాలు కోరుకునే ఆడియన్స్‌కు ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుంది. సిటీలో క్రైమ్ వుండకూడదని, క్రిమినల్స్‌ని ఎన్కౌంటర్ చేసే కమిషనర్ రోల్ చూడగానే ‘బిజినెస్‌మేన్’, రైతులు వ్యవసాయం చేసే భూముల్లో ఐరన్ ఉండటంతో గ్రామంపై వ్యపారవేత్త కన్నుపడటం కాన్సెప్ట్, క్లైమాక్స్ ఫైట్ వచ్చినప్పుడు ‘ఖలేజా’ గుర్తుకు వస్తాయి. ఆ సినిమాల్లో సన్నివేశాలకు భిన్నంగా బక్కియరాజ్ కణ్ణన్ ‘సుల్తాన్’ను నడిపించాడు. రొటీన్ కమర్షియల్ సినిమాలా కాకుండా ‘సుల్తాన్’ను కొత్తగా చూపించినది వందమంది రౌడీల కాన్సెప్ట్. వాళ్ళను కాపాడుకోవడం కోసం హీరో పడే తపన. ఇంటర్వెల్ బ్లాక్ ముందు హీరో ఫైట్ చేసేటప్పుడు వాళ్ళు చేసే హడావిడికి గూస్ బంప్స్ గ్యారెంటీ. క్లైమాక్స్‌లో వందమంది వెనక్కి రావడమూ గూస్ బంప్స్ మూమెంటే. కమర్షియల్ ఫార్మాట్‌లో కామన్ కంటెంట్ అయినా స్పీడ్‌గా సినిమాను రన్ చేయడం ఫస్టాఫ్‌లో ప్లస్ పాయింట్. సెకండాఫ్‌లో సినిమా కొంచెం స్లో అయ్యింది. మళ్లీ క్లైమాక్స్‌లో ట్రాక్‌లో పడింది. దర్శకుడికి రెండో సినిమా అయినప్పటికీ బాగా హ్యాండిల్ చేశాడు. స్ర్కీన్ మీద గ్రాండియర్ లుక్ కనిపించింది. ప్రొడ్యూసర్స్ బాగా ఖర్చు చేశారని తెలుస్తు వుంటుంది. పాటలు రొటీన్‌గా ఉన్నాయి. అవి మైనస్సే. నేపథ్య సంగీతం ఫర్వాలేదు.
కార్తికి ఇటువంటి రోల్‌లో యాక్ట్ చేయడం కొత్త కాదు. కమర్షియల్ సినిమాకు తగ్గట్టు నటించాడు. రష్మిక పల్లెటూరి యువతిగా నటించడం ఇదే తొలిసారి. వ్యవసాయ పనులు చేయడం చూస్తుంటే కొత్తగా కనిపించింది. క్యారెక్టర్ పరంగా చెప్పుకోవాలంటే డామినేటింగ్‌గా వుంటుంది. లాల్, నెపోలియన్, యోగిబాబు తదితరులు బాగా చేశారు.
ఫైనల్‌గా: మాస్ ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేసే కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘సుల్తాన్’. లాజిక్స్ వదిలేసి మ్యాజిక్‌ను ఎంజాయ్ చేసే ఆలోచన వుంటే, ఫైట్స్‌ను ఇష్టపడే ఆడియన్స్ హ్యాపీగా చూడొచ్చు.
Comments