ఆ రోజు ఇచ్చిన మాటను సుకుమార్ నిలబెట్టుకున్నాడు..! దర్శకుడు నిర్మాతలు

  • IndiaGlitz, [Tuesday,July 25 2017]

సుకుమార్ రైటింగ్స్ సంస్థ ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఆలోచనల నుంచి పుట్టింది. ఖచ్చితమైన ప్రణాళికలు, లక్ష్యాలను దృష్టిపెట్టుకొని ఈ సంస్థను స్ధాపించడం జరిగింది. ఈ సంస్థ నుంచి వచ్చే సినిమాలంటే కొత్తగా, ఎంటర్‌టైనింగ్‌గా ప్రేక్షకుల్ని టచ్ చేసే కథాంశాలతో రూపొందుతాయనే నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ఆనందంగా ఉంది అని తెలిపారు నిర్మాత బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్. సుకుమార్ రైటింగ్స్ పతాకంపై బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తిలతో కలిసి సుకుమార్ నిర్మిస్తున్న చిత్రం దర్శకుడు. అశోక్, ఇషా జంటగా నటిస్తున్నారు. హరి ప్రసాద్ జక్కా దర్శకుడు.
ఆగస్ట్ 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాతల్లో ఒకరైన బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్ మాట్లాడుతూ సుకుమార్ నా తమ్ముడే. బాల్యం నుంచి అతడి ప్రయాణం విభిన్నంగా సాగింది. దర్శకుడినవ్వాలనే నిరంతరం అనుకునేవాడు. చిన్నప్పుడు ప్రతి అంశాన్ని మాకు కథల రూపంలో చెప్పేవాడు. మా దగ్గరలో ఉన్న సఖినేటి పల్లి అనే ఊరు గురించి శ్రీరాముడు సీతాదేవితో సఖి... నేటి పల్లి ఇదే అంటూ మాట చెప్పడం వల్లే ఆ పేరు వచ్చిందని తనదైన శైలిలో మాకు కథల రూపంలో చెప్పి ఆకట్టుకునేవాడు. తాను దర్శకుడినైతే నన్ను తప్పకుండా నిర్మాతను చేస్తానని సుకుమార్ మాటిచ్చాడు. దర్శకుడు సినిమాతో ఆ రోజు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. సినిమా ప్రచారంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్, సమంత చక్కటి సహకారాన్ని అందించారు. ఓ సినిమా దర్శకుడి ప్రేమకథా చిత్రమిది అతడి జీవన గమనంలో ఎదురైన సంఘటనలేమిటనేది చిత్ర ఇతివృత్తం. అశోక్ చక్కటి నటనను కనబరిచాడు. నాకు తెలిసి ప్రపంచంలో 18 ప్రేమకథలు మాత్రమే ఉన్నాయి. బాలీవుడ్, టాలీవుడ్‌తో పాటు ప్రతి ఒక్కరూ వాటినే తెరపై చూపిస్తున్నారు. అందరికి తెలిసిన ఆ కథలను వెండితెరపై భిన్నంగా ఆవిష్కరించిన వారే విజయాల్ని దక్కించుకుంటున్నారు. ఆ జాబితాలో మా సినిమా ఉంటుంది. కుటుంబమంతా కలిసి చూసే సినిమా ఇది. ఇటీవల విడుదలైన గీతాలకు చక్కటి స్పందన లభిస్తున్నది. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి అని చెప్పారు.
మరో నిర్మాత థామస్‌రెడ్డి ఆదూరి మాట్లాడుతూ అగ్ర నటుల సినిమాలతో బిజీగా ఉండటంతో సుకుమార్ చిన్న సినిమాల్ని తెరకెక్కించలేకపోతున్నారు. సినిమాలు, ప్రమోషన్స్ ఇలా ప్రతి విషయంలో భిన్నంగా ఆలోచిస్తుంటారు. ప్రతిసారి కొత్తగా అడుగులు వేయాలని తపిస్తుంటారు. తన సినిమా షూటింగ్‌తో బిజీగా ఉండి కూడా ప్రమోషన్స్ విషయంలో మాకు అవసరమైన సలహాలు ఇస్తుంటారు. ఆయన స్పీడును అందుకోవడం ఎవరికి సాధ్యం కాదు. ప్రేక్షకుల హృదయాల్లో కలకాలం నిలిచిపోయే సినిమాలు చేయాలనే లక్ష్యంతోనే సుకుమార్ రైటింగ్స్ సంస్థను స్థాపించారు. కొత్త పాయింట్‌తో వైవిధ్యతను నమ్మి తొలి ప్రయత్నంగా ఆయన నిర్మించిన కుమారి 21ఎఫ్ చిత్రం చక్కటి విజయాన్ని సొంతం చేసుకుంది. అలాంటి మంచి సినిమాలో సుకుమార్‌తో కలిసి నేను భాగస్వాముడైనందుకు అదృష్టవంతుడిగా భావిస్తున్నాను. కుమారి 21ఎఫ్ తర్వాత మరోసారి మా కలయికలో వస్తున్న చిత్రం దర్శకుడు. సుకుమార్ రైటింగ్స్ సంస్థ లక్ష్యాలకు, ఆలోచనలకు తగ్గ కథ ఇది. ఏడాదిన్నర పాటు శ్రమించి దర్శకుడు హరిప్రసాద్ జక్కా ఈ కథను సిద్ధంచేశారు. కొత్త పాయింట్‌తో ఆద్యంతం ప్రేక్షకులకు వినోదాన్ని పంచే చిత్రమిది. సుకుమార్‌ను ఈ కథ చాలా ఆకట్టుకుంది. మాపై ఉన్న నమ్మకంతో ఈసినిమా నిర్మాణ బాధ్యతల్ని నాకు,విజయ్‌కుమార్‌కు అప్పజెప్పారు. ఆయన్ని సంతృప్తిపరిచేలా ఈ సినిమాను నిర్మించామని అనుకుంటున్నాం. ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తున్నది. నిర్మాణ విలువలు, దర్శకత్వం, కథ, కథనాలు బాగున్నాయని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు.
సుకుమార్ సినిమాల్లో హీరోల పాత్రలు మూసధోరణికి భిన్నంగా ఉంటాయి ఆర్య సినిమాలో ఆర్య, 100 పర్సెంట్ లవ్‌లో బాలు, నాన్నకు ప్రేమతో సినిమాలో అభిరామ్, వన్ నేనోక్కడినే గౌతమ్ పాత్రలు ప్రేక్షకుల ఊహలకు భిన్నంగా కొత్త పంథాలో సాగుతాయి. తెరపై ఎప్పుడు చూడని కొత్త పాత్రలను తన సినిమాల్లో సృష్టిస్తుంటారు సుకుమార్. ఆ పాత్రలతో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. ఆ పంథాలోనే దర్శకుడు సినిమాలో కథానాయకుడి పాత్ర సుకుమార్ ఆలోచనలకు అనుగుణంగా హరిప్రసాద్ జక్కా తీర్చిదిద్దారు. సుకుమార్‌తో అతడికి పదిహేనేళ్ల అనుబంధం ఉండటం వల్లే అదిసాధ్యమైందని అనుకుంటున్నాను. ఇందులో ఇండస్ట్రీపై, దర్శకులపై ఎలాంటి సెటైర్స్ ఉండవు. నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను సినిమాలో చూపించే ప్రయత్నం చేశాం అని తెలిపారు.