రంగస్థలం చూపిన దారిలో సుక్కు-బన్నీ సినిమా
- IndiaGlitz, [Tuesday,January 07 2020]
సినిమా అంటే సింపుల్‌గా తీసేయడము కాదు. సినిమాతో పాటు ప్రేక్షకుడు నడవాలి. ఆ సినిమాలో లీనమవ్వాలి. అక్కడి కథలో లీనమవ్వాలంటే.. అందులో ఉన్న కథ, కథనం, సినిమా సెట్టింగ్స్, లొకేషన్స్.. ఇలా ప్రతి ఒక్కటీ దానికి మ్యాచ్ కావాలి. ఈ పర్ఫెక్షన్తో సినిమాలు తీసే తెలుగు దర్శకుల్లో సుకుమార్ ఒకరు. తన సినిమాను లెక్కకట్టినట్టు, టెక్స్ట్ బుక్‌లో అచ్చుగుద్దినట్టు తీయడానికి తపన పడుతుంటారు ఈ లెక్కల మాస్టారు. ఆ పట్టుదలతో తీసిన రంగస్థలం ఎంత పెద్ద హిట్టో తెలియంది కాదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లో మరో ఆణిముత్యంగా నిలిచింది. తాజాగా స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌తో సుకుమార్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం కూడా అంతే స్థాయిలో పని చేస్తోంది సుక్కు టీమ్.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం ఓ అడవినే సృష్టించేందుకు సుకుమార్ రెడీ అవుతున్నారట. గత రంగస్థలం అనుభవంతో.. ఈ చిత్రాన్నే అదే రూట్లో చిత్రీకరించాలని నిర్ణయించుకున్నారట. ‘రంగస్థలం’ మూవీని మొదట రాజమండ్రి పరసర గోదావరి ప్రాంతాల్లో షూట్ చేశారు. అయితే హీరోయిన్ సమంత వడదెబ్బకు గురికావడం, చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో.. సినిమాకు ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో గోదావరినే హైదరాబాద్ శివారులలో దించేశారు సుకుమార్. గోదావరి ప్రాంతంలో తీసిన షాట్స్‌తో పాటు హైదబాద్‌లో తీసిన సన్నివేశాలను కలిపి.. నేత్రోత్సవం చేశారు ఈ విలక్షణ నటుడు. సరిగ్గా అలాగే ఫారెస్ట్ సెట్ వేసి.. బన్నీ సినిమాను కూడా షూట్ చేయాలని సుకుమార్ భావిస్తున్నారట. ఎండాకాలంలో షూటింగ్ ఉండటంతో.. ముందస్తు చర్యల్లో భాగంగా ఈ సినిమా కోసం అడవి సెట్ వేయడానికి నిశ్చయించుకున్నారట.