మంచి కథ కుదరగానే నేను, బన్ని ఆర్య 3 మూవీ చేస్తాం - సుకుమార్
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం `దర్శకుడు`. హరిప్రసాద్ జక్కా దర్శకుడు. ఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తి, సుకుమార్ నిర్మాతలు. ఈ చిత్రం ఆగస్ట్ 4న విడుదలవుతుంది. ఈ సందర్బంగా శనివారం ప్రీ రిలీజ్ వేడుక జరిగింది.
24 కాదు 25 శాఖలను మేనేజ్ చేసేవాడే దర్శకుడు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ - ``దర్శకుడు ఏం చేస్తాడు అనే డైలాగ్ ఈ సినిమా ట్రైలర్లో ఉంది. అలా ఎవరైనా నన్ను ప్రశ్నిస్తే నేను చెప్పే సమాధానం ఒక లైన్లో ఉంటుంది. దర్శకుడు అనేవాడు సినిమాలో పనిచేసే అందరికీ లైఫ్ ఇస్తాడని. మామూలుగా ఓ సినిమా కోసం 24 శాఖలు పనిచేస్తుందని అంటారు కానీ నాకు తెలిసి 25 శాఖలుంటాయి. ఆ 25వ శాఖ మరేదో కాదు, ఈగో మేనేజ్మెంట్. సినిమా శాఖల్లోని ఈగోస్‌ను దర్శకుడు మేనేజ్ చేస్తాడు. అది దర్శకత్వం చేయడం కంటే కష్టం. దర్శకులందరిలో నాకు సుకుమార్ చాలా ఇష్టం. సుకుమార్ నా పర్సనల్. తను సినిమా తీస్తున్నాడంటే నాకు చాలా పర్సనల్ అయిన విషయం. తను నిర్మించిన కుమారి 21 ఎఫ్ చూడగానే నాకు పిచ్చి లేసింది. అంత బాగా సినిమా నచ్చింది. ఒక పక్క దర్శకుడిగా సినిమాలు చేస్తూ మరోవైపు మంచి కథలతో సినిమాలు నిర్మించడం అంటే చాలా రిస్క్. అలాంటి రిస్క్ చేస్తున్న సుకుమార్‌ను చూసి గర్వపడుతున్నాను. ఒక దర్శకుడిగానే కాదు, నేను మగాళ్లలో ఇద్దరి ముగ్గురికి ఐ లవ్ యూ అని చెప్పాలనుకుంటే అందులో సుకుమార్ ఉంటాడు. తను నాకంతగా క్లోజ్. దర్శకుడు హరి, హీరో అశోక్, హీరోయిన్ ఈషా, పూజిత, కెమెరామెన్ సహా నటీనటులు, టెక్నిషియన్స్‌కు ఆల్ ది బెస్ట్. నేను, సుకుమార్ కలిసి ఆర్య చేశాం. ఆర్యలో హీరో కాస్తా ఎగ్జెయిటెడ్ క్యారెక్టర్. ఆర్యలో హీరో ఇంకా ఎగ్జయిటెడ్‌గా ఉంటాడు. ఆర్య3 అంటే హీరో పిచ్చోడిగా ఉండాలేమో. అలాంటి కథ కుదిరితే తప్పకుండా సినిమా చేస్తాం``అన్నారు.
బన్ని నా వల్లే హీరో అయ్యాడు.
సుకుమార్ మాట్లాడుతూ - ``ఈ కథ డైరెక్టర్ హరి ప్రసాద్ ఆలోచనల నుండి పుట్టింది. తనే అశోక్‌ని హీరోగా పెట్టి ఈ సినిమాను తీస్తామని అన్నాడు. తను కథ చెప్పిన విధానం నచ్చడంతో తననే డైరెక్ట్ చేయమని అన్నాను. అశోక్ డైరెక్టర్ అవుదామనుకుని వన్ నేనొనక్కడినే సినిమాకు నా దగ్గర అసిస్టెంట్‌గా చేరాడు. కానీ `దర్శకుడు` సినిమాతో తనని నేను హీరోగా మార్చేశాను. అశోక్ యాక్సిడెంటల్‌గా హీరో అయినా, తనకు మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను. ఇకన బన్ని గురించి చెప్పాలంటే.. బన్ని నా వల్లే హీరో అయ్యాడు. అదెలాగంటే ఆర్య షూటింగ్ జరగుతున్నప్పుడు నేను బోట్ నుండి నీళ్లలోకి పడిపోయాను. అందరూ చూస్తున్నారే తప్ప, ఎవరూ కాపాడటం లేదు. కానీ బన్ని నీళ్లలోకి దూకి తన ప్రాణాలకు తెగించి నన్ను కాపాడినా రియల్ లైఫ్‌లో హీరో అయ్యాడు. ఇక బన్నితో ఆర్య 3 చేయాలంటే కల్ట్ మూవీనే చేయాలి. అలాంటి కథ కుదరగానే మేం కలిసి పనిచేస్తాం. ఇక దర్శకుడు సినిమా ఆగస్ట్ 4న రిలీజ్ అవుతుంది. మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. సినిమాను పెద్ద సక్సెస్ చేస్తారని భావిస్తున్నాను.ఈ సినిమా నచ్చి డిస్ట్రిబ్యూషన్ హక్కులు కొన్న దిల్‌రాజుగారికి స్పెషల్ థాంక్స్`` అన్నారు.
సుకుమార్ బాడీ లాంగ్వేజ్‌తో రూపొందిన చిత్రం `దర్శకుడు`
దిల్‌రాజు మాట్లాడుతూ - ``14 ఏళ్ల క్రితం ఓ కుర్రాడు నాతో దిల్ సినిమాకు పనిచేశాడు. ఓ రోజు తను చెప్పిన లైన్‌తో తీసిన సినిమాయే ఆర్య. అలా చెప్పిన కుర్రాడే సుకుమార్. నాకు, బన్నికి, సుకుమార్‌కి ఆర్య సినిమానే టాప్. మేం ఎంత ఎదిగిన మేం వేసిన మొదటి అడుగు ఆర్య మాకు ఎప్పటికీ తీపి గుర్తే. ఈ దర్శకుడు సినిమాకు ముగ్గురం కలవడం ఆనందంగా ఉంది. ట్రైలర్, సాంగ్స్ చూస్తుంటే నాకు సుకుమారే కనపడుతున్నాడు. తను దర్శకత్వంపై పిచ్చి ఉన్న వ్యక్తి. సినిమాలో నవరసాల కోసం ఏమైనా చేస్తాడు. తను ఎలా బిహేవ్ ఎలా చేస్తాడో అన్ని సినిమాలో కనపడుతుంది. కుమారి 21 ఎఫ్‌తో నిర్మాతగా సక్సెస్ అందుకున్న సుకుమార్ దర్శకుడుతో మరో స్టెప్ ముందుకెళ్లాడు. అశోక్, హరి ప్రసాద్ జక్కా సహా అందరికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు.
`దర్శకుడు` కొత్తగా ఉంటుంది
హరి ప్రసాద్ జక్కా మాట్లాడుతూ - ``ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ చూసినవాళ్లు ఏ దర్శకుడినైనా ఇన్స్పిరేషన్గా తీసుకుని కథను తయారు చేశావా లేదా కథను ఎక్కడైనా కాపీ కొట్టేశా అన్నారు. కానీ ఈ కథ కొత్తగా ఉంటుంది. అయితే సుకుమార్ లైఫ్ నుండి ఓ సీన్‌ను కాపీ కొట్టాను. సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నపప్పుడు ఓ అమ్మాయితో ప్రేమలో ఉండేవాడు. ఆ అమ్మాయి సుకుమార్‌తో ఓ రోజు డ్యాన్స్ మాస్టర్ పాటకు కొరియోగ్రాఫీ చేస్తాడు. ఫైట్ మాస్టర్ ఫైట్స్ తీస్తాడు. ఇలా అందరూ అన్నీ చేస్తే దర్శకుడిగా నువ్వేం చేస్తావ్ అని అడిగింది. తనని లవర్‌గా వదిలేస్తే చాలా ప్రశ్నలేస్తుందని ఆమెను పెళ్లి చేసేసుకున్నాడు`` అన్నారు.
సూర్య ప్రతాప్ మాట్లాడుతూ - ``సుకుమార్‌గారి బ్యానర్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లో తొలి సినిమా కుమారి 21 ఎఫ్ సినిమాను డైరెక్ట్ చేసే అవకావం ఇచ్చిన సుకుమార్‌గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. హరి ప్రసాద్‌గారు చాలా గొప్పగా కథను రాసుకున్నారు. అందుకే సుకుమార్‌గారు ఆయన డైరెక్ట్ చేయగలరని నమ్మి డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చారు. సాయికార్తీక్‌గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. నవీన్ నూలి, ప్రవీణ్ సహా అందరికీ థాంక్స్. ఒక సినిమాను ప్రేమించి తీసే నిర్మాతల్లో విజయ్‌కుమార్‌రెడ్డి, థామస్ రెడ్డిగారికి అభినందనలు. సినిమాకు పనిచేసిన నటీనటులు, టెక్నిషియన్స్‌కు అభినందనలు`` అన్నారు.
సాయికార్తీక్ మాట్లాడుతూ - ``దర్శకుడు సినిమాకు నేను మ్యూజిక్ ఇవ్వడానికి కారణం బన్నిగారే. ఆయనే సుకుమార్‌కు నన్ను పరిచయం చేశారు. ఈ విషయంలో బన్నిగారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ సినిమాలో మంచి మెలోడీస్ చేసే అవకాశం వచ్చింది. సాంగ్స్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చాయి`` అన్నారు.
ఈ కార్యక్రమంలో సుకుమార్ సతీమణి కవిత, సురేందర్ రెడ్డి సతీమణి దీపారెడ్డి, హీరోయిన్స్ ఈషా, పూజిత, ఎడిటర్ నవీన్ నూలి, ప్రవీణ్ సహా చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments