చంద్రబాబు కాబట్టి ఉన్నారు.. నేనైతే అస్సలుండను!?

  • IndiaGlitz, [Wednesday,September 25 2019]

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒకప్పటి టీడీపీ నేత.. ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు, ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఇన్ని రోజులు ఎన్నెన్ని మాటలు ఆయన కడుపులో పెట్టుకుని ఉన్నారో గానీ.. కాషాయ కండువా కప్పుకున్న తర్వాత అన్నీ కక్కేస్తున్నారు. ఇప్పటికే ఒకట్రెండు సార్లు మీడియా ముందుకు వచ్చిన సుజనా.. చంద్రబాబుపై ఊహించని కామెంట్స్ చేశారు. అయితే తాజాగా మరో అడుగు ముందుకేసిన ఎంపీ.. గత కొన్ని రోజులుగా వివాదాస్పదమైన చంద్రబాబు కరకట్ట ఇంటిపై కామెంట్స్ చేశారు.

నేనైతే అస్సలుండను!

‘చంద్రబాబు ఆ గెస్ట్‌హౌస్‌లో ఇంకా ఎందుకు ఉంటున్నారో నాకు మాత్రం అర్థంకావడం లేదు. అదే నేనైతే ఆ ఇంట్లో అస్సలు ఉండను. అద్దె ఇంట్లో సమస్య వస్తే అక్కడి నుంచి వెళ్లిపోవడమే మంచిది. ఈ అంశంలో సానుభూతి పొందేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం పాలసీ నిర్ణయం తీసుకుని ముందుకు సాగితే బాగుంటుంది. ఓ వైపు ప్రభుత్వం, మరోవైపు విపక్షం ముఖ్యమైన అంశాలను పక్కనపెట్టి ప్రతిరోజూ ఈ అంశంపైనే కాలం గడిపేస్తోంది’ అని ఇటు చంద్రబాబుపై.. అటు వైసీపీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు.

రివర్స్ టెండరింగ్‌పై..!

ఏపీలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ దొందూ దొందే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయన్నారు. రివర్స్ టెండరింగ్‌లో కేవలం ఒకే ఒక్క కంపెనీ పాల్గొనడం ఏంటి..?. కనీసం ఇద్దరు కూడా లేకుండా రివర్స్ టెండరింగ్ అంటే హాస్యాస్పదంగా ఉంది. పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. తూతూమంత్రంగా పోలవరం రివర్స్ టెండరింగ్ చేపట్టారు. గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ప్రాజెక్టును ఆలస్యం చేశారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ చర్యలతో మరో మూడేళ్లు ఆలస్యమయ్యే పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా సుమారు ఐదారువేల కోట్ల నష్టం వస్తుంది. ప్రాజెక్టులో అవినీతిని తగ్గిస్తే ఎక్కడ తగ్గించారో చెప్పాలి’ అని సుజనా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

అయితే చంద్రబాబుపై సుజనా చేసిన ఆరోపణలు టీడీపీ.. రివర్స్ టెండరింగ్ చేసిన ఆరోపణలపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి. కాగా ఇప్పటి వరకూ సుజనా వ్యాఖ్యలను అధికార, ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలెవ్వరూ లెక్కచేయలేదు.. అందుకే ఒక్కరంటే ఒక్కరు కూడా మీడియా ముందుకొచ్చి మాట్లాడిన సందర్భాల్లేవ్. మరి ఈసారైనా ఈ ఎంపీ వ్యాఖ్యలపై నేతలు స్పందిస్తారేమో వేచి చూడాలి.