ఇలాంటి ఘటన ఇదే తొలిసారి.. ‘ఎంవీ ఎవర్‌గివెన్’ బయటకు వచ్చేదెప్పుడో..
Send us your feedback to audioarticles@vaarta.com
ఈజిప్టులోని సూయిజ్ కాలువలో ప్రపంచంలోనే అతిపెద్ద నౌక ఇరుక్కుపోయింది. ప్రపంచంలోనే అతి పెద్ద సరుకు రవాణా నౌకల్లో ఒకటైన ‘ఎంవీ ఎవర్‌గివెన్’ ప్రమాదవశాత్తు సూయిజ్ కాలువలో చిక్కుకుపోయింది. దీంతో ఇతర నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జపాన్‌కు చెందిన ఈ నౌక 2.20 లక్షల టన్నుల సామగ్రితో ప్రయాణిస్తోంది. 400 మీటర్ల పొడవున్న ఈ నౌక తూర్పు పైభాగం ప్రమాదవశాత్తు తూర్పు గోడను.. కింద భాగం పశ్చిమ గోడను తాకడంతో అక్కడే ఇరుక్కుపోయింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ కెనాల్ ద్వారా ప్రతిరోజూ 10 లక్షల బ్యారెల్స్ ఆయిల్ సరఫరా జరుగుతుంటుంది. ప్రస్తుతం షిప్ చిక్కుకున్న కారణంగా గంటకు సుమారు 3వేల కోట్ల రూపాయల మేర నష్టం జరిగే అవకాశం ఉంటుందని అంచనా.
కొన్ని వారాలు పట్టొచ్చు..
కాగా.. సూయజ్ కాలువలో ‘ఎవర్ గివెన్’ అడ్డుగా నిలవడంతో ప్రపంచదేశాలు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ఐరోపా దేశాలు, అమెరికా చమురు దిగుమతి కోసం ఇదే మార్గాన్ని ఎంచుకుంటాయి. ‘ఎవర్ గివెన్’ ఇరుక్కుపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాలువలో ప్రయాణాన్ని పునరుద్ధరించేందుకు కొన్ని వారాల వరకూ సమయం పట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ దేశాల్లో చమురు ధరలు పెరిగాయి. ఇవే కాక.. పలు రకాల వస్తువులూ ధరలు పెరిగే అవకాశమందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. సూయజ్ కాలువ కారణంగా ఐరోపా దేశాలకు 8900 కిలోమీటర్ల దూరం తగ్గింది. సుమారు 10 రోజుల సమయంతో పాటు ఆ ప్రయాణానికి తగ్గ ఇంధనం నౌకలకు ఆదా అవుతుంది.
భారత్ నౌకలు కూడా ఉన్నాయి..
ఈ సౌకర్యం కోసమే 1869లో సూయజ్ కాలువను తెరిచారు. అప్పటి నుంచి ఈ కాలువ అంతర్జాతీయ వాణిజ్యానికి కేంద్ర బిందువుగా మారింది. ప్రస్తుత అడ్డంకి కారణంగా రోజుకు రూ. 75వేల కోట్ల విలువైన సరుకు నిలిచిపోతోందని అంచనా. శుక్రవారం నాటికి 240 నౌకలు ఇరువైపులా నిలిచిపోయాయి. వీటిలో రెండు భారత నౌకలు కూడా ఉండటం గమనార్హం. కాగా ఇటువంటి ఘటన జరగటం గత 150 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియ సజావుగా పూర్తి అయ్యేలోపు ఈ మార్గంలో ప్రయాణించాల్సిన ఇతర నౌకలపై సముద్రపు దొంగలు దాడిచేసే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి దొంగతనాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
షిప్‌ను బయటికి తీసేందుకు కొనసాగుతున్న యత్నాలు..
మరోవైపు.. సూయజ్ కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయిన 'ఎవర్ గివెన్' షిప్‌ను బయటికి తీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ షిప్ తైవాన్‌లోని 'ఎవర్‌గ్రీన్ మెరైన్' అనే సంస్థకు చెందినది. దీన్ని దారికి తేవడానికి 9 టగ్‌ల (లాగే ఓడలు)తో ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారని ఈ నౌక ప్రయాణాన్ని మేనేజ్ చేస్తున్న 'బెర్న్‌హార్డ్ షల్ట్ షిప్‌మేనేజ్‌మెంట్' అనే సంస్థ వెల్లడించింది. ఓడకు ఇనుప తాళ్లు కట్టి లాగుతూ, ఇసుక మేటలను కదిలించేందుకు టగ్‌లు ప్రయత్నిస్తున్నాయి. కాలువ రెండు తీరాలను తాకుతూ షిప్ ఆగిపోవడంతో దానిని బైటికి తీసుకురావడం కష్టమవుతోందని క్యాంప్‌బెల్ యూనివర్సిటీ మారిటైమ్ హిస్టరీ నిపుణుడు సాల్ మెర్కోగ్లియానో అన్నారు. నెదర్లాండ్‌కు చెందిన బోస్కాలిస్ అనే డ్రెడ్జింగ్ కంపెనీ ఈ ఇసుకను తొలగించే పనిని చేపట్టింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout