సుధీర్ బాబు, మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి కాంబినేష‌న్లో మూడో చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'

'సమ్మోహనం', 'వి' తర్వాత హీరో సుధీర్ బాబు, ద‌ర్శ‌కుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేష‌న్లో మూడో చిత్రం రూపోందుతోంది. రొమాంటిక్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం ద‌ర్శ‌కుడు మోహ‌న్ కృష్ణ ఇంద్ర‌గంటి డ్రీమ్ ప్రాజెక్ట్ కావ‌డం విశేషం. ఈ చిత్రానికి 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే ఆస‌క్తిక‌ర టైటిల్‌ను ఖ‌రారు చేశారు. త‌న సినిమాల‌కు పెట్టే టైటిల్స్ విష‌యంలో చాలా శ్ర‌ద్ధ తీసుకొని, ఆస‌క్తి రేకెత్తించే తెలుగు టైటిల్స్ పెట్టే మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి మ‌రోసారి, అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించేలా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే టైటిల్ పెట్టారు.

ఒక వండ‌ర్‌ఫుల్ ల‌వ్ స్టోరీతో, రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొందుతోంద‌ని టైటిల్‌ని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. ఈ మూవీలో సుధీర్ బాబు స‌ర‌స‌న నాయిక‌గా నేటి సెన్సేష‌న‌ల్ హీరోయిన్ కృతి శెట్టి న‌టిస్తున్నారు. త‌న సినిమాల్లో హీరోయిన్ రోల్స్‌కు చాలా ప్రాముఖ్యం ఇచ్చే, వారిని తెర‌పై బ్యూటిఫుల్‌గా ప్రెజెంట్ చేసే ఇంద్ర‌గంటి, ఈ సినిమాలోనూ కృతిని అంతే అందంగా ప్రెజెంట్ చేస్తున్నారు. త‌ను ప్రేమించిన అమ్మాయిగా న‌టిస్తోన్న కృతి శెట్టి పాత్ర గురించి సుధీర్ బాబు ఏం చెప్పాల‌నుకుంటున్నార‌నేది ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' రెగ్యుల‌ర్ షూటింగ్ హైద‌రాబాద్‌లో నేడు ప్రారంభ‌మైంది.

బెంచ్ మార్క్ స్టూడియోస్ ప‌తాకంపై గాజుల‌ప‌ల్లి సుధీర్ బాబు స‌మ‌ర్పిస్తోన్న ఈ చిత్రాన్ని బి. మ‌హేంద్ర‌బాబు, కిర‌ణ్ బ‌ల్ల‌ప‌ల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వివేక్ సాగ‌ర్ సంగీతం అందిస్తుండ‌గా పీజీ విందా సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా సాహి సురేష్‌‌, ఎడిట‌ర్‌గా మార్తాండ్ కె. వెంక‌టేష్ వ‌ర్క్ చేస్తుండ‌గా, సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, రామ‌జోగ‌య్య శాస్త్రి సాహిత్యం అందిస్తున్నారు. అవ‌స‌రాల శ్రీ‌నివాస్, వెన్నెల కిశోర్, రాహుల్ రామ‌కృష్ణ‌, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, క‌ల్యాణీ న‌ట‌రాజ‌న్‌ ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

తారాగ‌ణం: సుధీర్ బాబు, కృతి శెట్టి, అవ‌స‌రాల శ్రీ‌నివాస్, వెన్నెల కిశోర్, రాహుల్ రామ‌కృష్ణ‌, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, క‌ల్యాణీ న‌ట‌రాజ‌న్.