సుధీర్‌బాబు ఇన్‌స్పైరింగ్ స్టోరీ.. ‘వి’ షూటింగ్‌కు ముందు ఏం జరిగిందంటే..

  • IndiaGlitz, [Saturday,September 05 2020]

హీరో సుధీర్ బాబు ట్విట్టర్ వేదికగా ఒక వీడియోను విడుదల చేశాడు. ‘వి’ సినిమా షూటింగ్‌కు కొద్ది రోజుల ముందు ఏం జరిగిందో ఆ వీడియోలో సుధీర్‌బాబు వివరించాడు. దీనిలో ఉన్న ఇన్‌స్పైరింగ్ స్టోరీ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సుధీర్‌బాబు ఓ గాయం నుంచి కోలుకుని.. ‘వి’ షూటింగ్‌కు సిద్ధమైన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

‘వి’ సినిమా షూటింగ్‌కు కొద్ది రోజుల ముందే సుధీర్ బాబు మోకాలు గాయంతో బాధపడ్డాడు. మోకాలుకు అనేక ఫిజియోథెరపీల అనంతరం కోలుకున్నాడు. ఈ క్రమంలో ఎంతో నొప్పి భరిస్తూ ఆయన చేసిన ఎక్సర్‌సైజ్‌లు ఆకట్టుకుంటున్నాయి. ఫిజియోథెరపీతో పాటు వివిధ రకాల వ్యాయామాలతో ఆయన తన మోకాలు బలాన్ని పెంచుకున్నాడు. దీనినంతటినీ సుధీర్ బాబు వీడియో తీసి.. దానికి ‘వి’ సినిమాలో చేసిన డ్యాన్సులు, ఫైట్‌లను జత చేసి ఆ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.

ఆ వీడియోలో సుధీర్ బాబు మాట్లాడుతూ... ‘‘నేను ఎంత కష్టాన్ని అనుభవించానో చెప్పేందుకు ఈ వీడియో రిలీజ్ చేయడం లేదు. ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నవారికి స్ఫూర్తి కలిగించేందుకు ప్రయత్నిస్తున్నా. కష్టమొస్తే చీకట్లో ఉండొద్దు. వెలుగులోకి వచ్చే ప్రయత్నం చేయండి. ‘వి’ సినిమాకు కొన్ని నెలల ముందు నా మోకాలుకు గాయమైంది. నడవడానికి కూడా ఇబ్బంది పడ్డాను. నొప్పిని తట్టుకుంటూ నడిచేందుకు ప్రయత్నించా.. వ్యాయామాలు చేశాను. ఆ నొప్పిని భరించడాన్ని ఎంజాయ్ చేశాను. నా మోటివేషన్ నా సినిమా, నా ప్రేక్షకులు’’ అని తెలిపాడు.