Sudhamurthy:రాజ్యసభకు సుధామూర్తి నామినేట్.. ప్రధాని మోదీ శుభాకాంక్షలు..
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ మాజీ ఛైర్పర్సన్, రచయిత్రి సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెను పెద్దల సభకు నామినేట్ చేసినట్లు ప్రధాని మోదీ స్వయంగా వెల్లడించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెను రాజ్యసభకు నామినేట్ చేసినట్లు తెలిపారు. విద్యారంగంలోనే కాకుండా సమాజానికీ ఎంతో విలువైన సేవలు అందించారని కొనియాడారు. ఈ సందర్భంగా సుధామూర్తికి శుభాకాంక్షలు చెబుతూ ఆయన ట్వీట్ చేశారు.
"రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుధామూర్తిని రాజ్యసభకి నామినేట్ చేశారని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. సామాజిక సేవ, దాతృత్వం, విద్యారంగంలో ఆమె చేసిన కృషి ఎంతో స్ఫూర్తిదాయకం. రాజ్యసభలో ఆమె ప్రాతినిధ్యం నారీశక్తికి నిదర్శనం. దేశ సమర్థతని, మహిళల శక్తిని పెంచాలన్న మా లక్ష్యానికి ఇదో గొప్ప ఉదాహరణ" అని మోదీ పేర్కొన్నారు.
కాగా అంతర్జాతీయ మహిళ దినోత్సవం రోజును పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. సుధామూర్తిని రాజ్యసభకు నామినేట్ చేశారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి భార్య అయిన సుధామూర్తి టెక్నికల్, ట్రావెల్ వంటి అంశాల్లో అనేక రచనలు చేశారు. ఆంగ్ల, కన్నడ భాషల్లో ప్రచురితమైన ఆమె రచనలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. అలాగే తన ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఆరోగ్య సంరక్షణ, పారిశుద్ధ్యం వంటి సమస్యలపై ఇన్ఫోసిస్ పౌండేషన్ ద్యారా సేవలు అందిస్తున్నారు. ఈ పౌండేషన్‌కు సుధామూర్తి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వేల గృహలను, స్కూల్స్, లైబ్రరీలను నిర్మించారు. పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణానికి కూడా నిధులను ఈ సంస్థ ద్వారా సమకూర్చారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం ఆమె సొంతం. వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతినే కాకుండా ఏకంగా యూకే ప్రధానికి స్వయానా అత్త అయినా కూడా ఎలాంటి ఆడాంబరాలకు పోకుండా సింపుల్‌గా జీవిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాగే సామాన్య ప్రజలకు తన ద్వారా ఎంతో కొంత సేవ చేయాలని ఆమె ఎప్పుడూ ఆరాటపడుతుంటారు.
1950 ఆగస్టు 19న కర్ణాటకలోని షిగ్గావ్‌లో సుధామూర్తి జన్మించారు. ఇంజనీరింగ్ చదువు పూర్తి చేసిన ఆమె కంప్యూటర్ సైంటిస్ట్‌గా తన వృత్తిని ప్రారంభించారు. టాటా ఇంజనీరింగ్ లోకోమోటివ్ కంపెనీ(టెల్కో)లో తొలిసారి ఇంజనీర్‌గా విధులు నిర్వర్తించారు. అలాగే తన భర్త నారాయణమూర్తితో కలిసి ఇన్ఫోసిస్ సంస్థను ప్రారంభించారు. చిన్న కంపెనీగా మొదలైన ఇన్ఫీ.. ఇప్పుడు వేల కోట్ల టర్నోవర్‌తో దేశంలోనే అగ్రగామి ఐటీ సంస్థగా పేరు ప్రఖ్యాతలు దక్కించుకుంది. ఇక సుధామూర్తి దంపతుల కుమార్తె అక్షతా మూర్తి.. యూకే ప్రధానమంత్రి రిషి సునాక్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments