ఆయన ఒకవేళ ఒప్పుకోకపోతే ఈ సినిమా అసలు ఉండేదే కాదు - సుధ కొంగర
- IndiaGlitz, [Thursday,March 30 2017]
సుధ కొంగర పేరు వినగానే సాలా ఖద్దూస్, ఇరుదు సుట్రు సినిమాలు గుర్తుకొస్తాయి. 'హీరో వెంకటేశ్ తొలిసారి ఓ మహిళ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. అందులోనూ చాలా రగ్డ్ లుక్‌తో కనిపిస్తున్నారు... సినిమా ఎలా ఉంటుందో' అనే టాక్ వచ్చింది సుధ కొంగర గురించే. ఈమెకు దర్శకత్వశాఖలో మంచి అనుభవం ఉంది. ఆ అనుభవంతోనే ఆమె మహిళా బాక్సర్‌లకు సంబంధించిన కథతో సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది.
ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆ విశేషాలు...
మీ గురించి చెప్పండి? మీరు తెలుగువాళ్లా? తమిళియనా?
- మేం తెలుగువాళ్లమే. కాకపోతే చెన్నైలో సెటిలైన ఫ్యామిలీ మాది. ఇంట్లో తెలుగే మాట్లాడుకుంటాం. కొన్నాళ్లు వైజాగ్‌లో కూడా ఉన్నాను.
సినిమాల్లోకి రావాలని ఎందుకనిపించింది?
- సినిమాల మీద చిన్నప్పటి నుంచి చాలా ప్యాషన్ ఉండేది. సినిమా రూపకర్త మీద గురి ఉండేది. అందుకే నేను దర్శకత్వశాఖను ఎంపిక చేసుకున్నాను.
మణిరత్నం క్రూలో మీరు కూడా ఉన్నారట కదా?
- అవునండీ. దర్శకత్వం చేయాలనుకున్నప్పుడు ఎవరి దగ్గర చేరాలా? అనే ఆత్రుత ఉండేది. అప్పుడు నేననుకున్నవారిలో మొదటిపేరు మణిరత్నంగారిది. ఆయన దగ్గర అసిస్టెంట్ డైరక్టర్‌గా చేశాను.
మూడు భాషల్లో ఒక కథను తీస్తున్నారంటే అంతగా అందులో నచ్చిందేమిటి?
- మహిళా బాక్సింగ్ అనే విషయమే నాకు చాలా నచ్చింది. లేడీస్ బాక్సింగ్ అంటే అమ్మాయిలు చాలా లావుగా అలా ఉంటారని అనుకునేదాన్ని. కానీ వాళ్ల గురించి తెలుసుకునేకొద్దీ చాలా ఆసక్తికరమైన అంశాలు తెలియసాగాయి.
నిజ జీవిత స్ఫూర్తి ఉందని కూడా అన్నారుగా?
- ఒకరోజు నేను హిందూ పత్రిక చదువుతున్నప్పుడు అందులో కూలీ చేసుకునే తల్లిదండ్రులు తమ పిల్లలను బాక్సింగ్‌కి పంపుతున్నారని చదివాను. బాక్సింగ్ మీద అంత ఆసక్తి ఎందుకు ఏర్పడింది అని ఆరాతీస్తే.. రూ.250 కడితే బాక్సింగ్ నేర్చుకోవచ్చు. అందులో ఏదైనా ప్రావీణ్యం చూపగలిగితే పోలీసు ఉద్యోగంలో రాణించవచ్చు అనేది వారు నమ్మిన విషయం. నా అన్వేషణలో ఇలాంటి కథలు బోలెడున్నాయి.
అంటే సీక్వెల్ చేయొచ్చన్నమాట...
- ఒకటి, రెండు కాదు... చాలా సీక్వెల్స్ చేయొచ్చు.
మీ నెక్స్ట్ సినిమా సీక్వెలేనా?
- ఇంకా డిసైడ్ కాలేదు. ఇంకో వారం రోజుల్లో డిసైడ్ అవుతుంది. చెబుతాను.
తమిళ్‌లో మాధవన్, తెలుగులో వెంకటేశ్... స్టార్లను ఎలా సెలక్ట్ చేశారు?
- నిజమే అక్కడ మాధవన్‌కు చాక్లెట్ బోయ్ ఇమేజ్ ఉంది. దాన్ని బ్రేక్ చేసి ఓ కోచ్‌గా సక్సెస్ అయ్యాం. తెలుగులో ఆ సినిమాను చూసి వెంకటేశ్‌గారు నచ్చిందన్నారు. వెంకీగారి లుక్‌తోనే సగం కోచ్ అనే ఫీలింగ్ జనాలకు వచ్చేసింది.
వెంకటేశ్‌గారు ఒప్పుకోకపోతే.. ఇంకెవరితో చేసేవారు?
- ఆయన ఒకవేళ ఒప్పుకోకపోతే ఈ సినిమా అసలు ఉండేదే కాదు. ఇరుదు సుట్రు చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేసేవాళ్లం. ఎందుకంటే వెంకీగారిని ఇది యాప్ట్ స్టోరీ.