చరణ్ చిత్రంలో సుదీప్?
- IndiaGlitz, [Sunday,April 29 2018]
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వాని జంటగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. యాక్షన్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో తమిళ హీరో ప్రశాంత్‌తో పాటు ఆర్యన్ రాజేష్, స్నేహ, మహేష్ మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. ప్రతినాయక పాత్రలో వివేక్ ఒబెరాయ్ కనిపించనున్నారు.భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో మరో స్టార్ నటుడు కూడా నటించే అవకాశం ఉన్నట్టు సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే.. ఈ సినిమాలో ఓ పవర్ఫుల్ రోల్ కోసం కన్నడ స్టార్ నటుడు కిచ్చా సుదీప్‌ను సంప్రదించిందంట చిత్ర బృందం. పాత్ర నచ్చడంతో సుదీప్ కూడా వెంటనే ఓకే చెప్పేశారని తెలుస్తోంది. ‘ఈగ’ సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సుదీప్ ఈ సినిమాతో మరోసారి ఆడియన్స్‌ను అలరిస్తారని చెబుతున్నారు.
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'సైరా'లో కూడా సుదీప్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. మొత్తానికి.. సుదీప్ ఏకకాలంలో తండ్రీ కొడుకులతో కలిసి నటించే అవకాశం దక్కించుకున్నాడన్నమాట.