Subrahmanyapuram Review
కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం, అనుకున్న జవాబులు నిజమేనని తేల్చడం అంత తేలిక కాదు.`సుబ్రమణ్యపురం`లో డీల్ చేసిన విషయం కూడా అలాంటిదేనని అనిపిస్తోంది. మానవ మేధస్సు గొప్పదా? దైవలీలలు గొప్పవా? దేన్ని ఎలా చూడాలి? వంటి విషయాలను డీల్ చేసే సినిమా `సుబ్రహ్మణ్యపురం`. సుమంత్, ఈషారెబ్బా జంటగా నటించిన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంది. సినిమా కూడా అదే స్థాయిలో ఉందా? ప్రేక్షకులను మెప్పించే అంశాలు ఇందులో ఏం ఉన్నాయి? ఒకసారి చదివేయండి..
కథ:
సుబ్రహ్మణ్యపురంలో సుబ్రహ్మణ్యస్వామికి సంబంధించిన పురాతన ఆలయం ఉంటుంది. అందులో విగ్రహానికి అభిషేకం నిషేధం. కానీ ఓ వ్యక్తి అభిషేకం చేయడమే కాకుండా.. అదే గుడిలో ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. తర్వాత ఊర్లో పదిహేను మంది దాకా.. ఆత్మహత్యలు చేసుకుని చనిపోతారు. అలా చనిపోయే వారికి పెద్ద నెమలి కనపడుతుంటుంది. ఊరి పెద్ద సురేంద్ర వర్మ(సురేశ్) సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక సతమతమవుతుంటాడు. కథ ఇలా సాగుతుండగా పురాతన ఆలయాలపై రీసెర్చ్ చేసే స్కాలర్ కార్తీక్(సుమంత్). సిటీలో చదువుకుంటున్న ఊరి పెద్ద ప్రియ(ఈషారెబ్బా)ను ప్రేమించి.. ఆమె తండ్రితో మాట్లాడటానికి సుబ్రహ్మణ్యపురం వస్తాడు. అక్కడ జరిగే ఆత్మహత్యలు వెనుక దేవుడి శాపం ఉందని ప్రజలు అంటే.. లేదు ఎవరో మనుషులున్నారని వారిని పట్టుకుంటానని అంటాడు కార్తీక్. మరి సుబ్రహ్మణ్యపురం ఆత్మహత్యలు వెనుక ఉన్న మనుషులెవరు? కార్తీక్ వాళ్లని పట్టుకున్నాడా? అనే సంగతి తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
విశ్లేషణ:
25 సినిమాలను ఈ సినిమాతో క్రాస్ చేసిన సుమంత్ ఇన్నేళ్ల కెరీర్‌లో తొలిసారిగా చేసిన థ్రిల్లర్ మూవీ ఇది. థ్రిల్లర్ మూవీ అంటే కమర్షియల్ హంగులు ఉండనక్కర్లేదు. డాన్సులు, ఫైట్స్ పరంగా పెద్దగా కష్టపడనక్కర్లేకుండా కూడా సినిమా చేసుకోవచ్చు కాబట్టి దర్శక నిర్మాతలు ఇదే ఫార్ములాతో ఈ సినిమా చేశారు. సుమంత్‌కు డాన్సులు, ఫైట్స్ విషయంలో శ్రమ పడే పని లేకుండా పోయింది. కాబట్టి పాత్ర పరంగా తను పెద్దగా కష్టపడలేదు. ఈషా రెబ్బా పాత్ర పరిధి మేర చక్కగా నటించింది. ఊరి పెద్దగా నటించిన సురేశ్, హీరో స్నేహితులుగా నటించిన భద్రమ్, జోష్ రవి, మానస, అతిథి పాత్రలో నటించిన సాయికుమార్ తదితరులు వారి వారి పాత్రల పరిధుల మేర చక్కగా నటించారు. ఇక సాంకేతికంగా చూస్తే దర్శకుడు సంతోష్ రాసుకున్న మెయిన్ పాయింట్ బాగానే ఉంది. ఆ థ్రిల్లింగ్ మూమెంట్‌ను ఫస్టాఫ్ లవ్ ట్రాక్ ఇరికించడం, అనవసరమైన కామెడీ ట్రాక్‌తో పక్కదోవ పట్టించేసి సాగదీతగా లాగించేశాడు. దాంతో సినిమాలో కిక్ కనపడదు. శేఖర్ చంద్ర నేపథ్య సంగీతం పరావాలేదు. పాటలు పెద్దగా బాగా లేదు. ఆర్.కె.ప్రతాప్ కెమెరా వర్క్ ఓకే. ఎడిటింగ్ పరంగా కొన్ని అనవసరమైన సన్నివేశాలను కట్ చేసుండొచ్చుననిపించింది. మొత్తంగా చూస్తే ప్రధానమైన పాయింట్ బాగానే ఉన్నా.. ఆసక్తికరంగా సినిమాను తెరకెక్కించలేకపోయిన తీరు కనపడుతుంది.
బోటమ్ లైన్: ఆసక్తికరంగా లేని థ్రిల్లర్ ..'సుబ్రహ్మణ్యపురం'
- Read in English