ఎయిర్ ఇండియా అమ్మకం.. స్వపక్షంలోనే మోడీపై విమర్శలు
- IndiaGlitz, [Monday,January 27 2020]
ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియా అప్పుల భారంతో కూరుకుపోయింది. దీంతో సంస్థను పూర్తిగా విక్రయించాలనుకుటున్నట్లు కేంద్ర ప్రభుత్వం సోమవారం సంచలన ప్రకటన చేసింది. ఎయిర్ ఇండియా స్వదేశీ, విదేశీ రూట్లలోని వాటాలను అప్పగిస్తామని, కేంద్ర ప్రకటించింది. బిడ్లు దాఖలు చేసేందుకు మార్చి 17 వరకు గడువును నిర్ణయించింది. బిడ్డర్ 3.26 బిలియన్స్ రుణాన్ని అందచేసి బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. అయితే 2018లో 76 శాతం వాటాలను వికయించడానికి ప్రభుత్వం ప్రయత్నించి 5.1 బిలియన్ డాలర్స్‌ను కోట్ చేయడంతో ఎవరూ బిడ్స్ వేయలేదు.
అయితే ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలు ఒక్కసారిగా నిరసన గళాన్ని గట్టిగా వినిపించాయి. ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయమేమంటే మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విపక్షాలే కాదు..స్వపక్షం నుండి కూడా నిరసన గళం వినపడింది. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆ పార్టీ పార్లమెంట్ సభ్యుడు సుబ్రమణ్యస్వామి అగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంతే కాకుండా తనదైన స్టైల్లో ఈ వ్యవహారంపై మోడీ ప్రభుత్వాన్ని కూడా కోర్టుకు లాగుతానని ఆయన ట్వీట్ చేయడం విశేషం.
ప్రభుత్వ రంగ సంస్థను ప్రవేటు పరం చేయడం జాతి వ్యతిరేకమని సుబ్రమణ్యస్వామి పేర్కొన్నారు. ఎయిర్ ఇండియా వాటాలను విక్రయించడం వల్ల కీలకమైన విమానయాన సంస్థపై ప్రైవేటు రంగాన్ని ఆహ్వానించినట్లేనని ఆయన తెలిపారు. మోడీ ప్రభుత్వం వద్ద డబ్బులు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆస్తులను అమ్మి సొమ్ము చేసుకుంటుందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ప్రస్తుతం వృద్ధి రేటు 5 శాతం కన్నా తక్కువగా నమోదు కావడం ఆందోళనను కలిగిస్తుందని కాంగ్రెస్ పార్టీ నేత కపిల సిబాల్ విమర్శలు చేశారు.