Pawan Kalyan:పవన్ కల్యాణ్ సీఎం కావాలి .. జనసేనకు స్టంట్ మ్యాన్ విరాళం, ఆ సినిమా పారితోషికం మొత్తం పార్టీకి
- IndiaGlitz, [Thursday,September 28 2023]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పట్ల అభిమానాన్ని చాటుకున్నారు స్టంట్ మ్యాన్ శ్రీబద్రి. చిరంజీవి హీరోగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో వచ్చిన భోళా శంకర్ సినిమాకు తాను అందుకున్న రూ.50 వేల పారితోషికాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పార్టీ అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్‌ను కలిసి చెక్‌ను అందజేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమలో వెహికల్స్‌తో ఎలాంటి ప్రమాదకరమైన స్టంట్స్ చేయాలన్నా అది బద్రికే సాధ్యమన్నారు. తాను నటుడిగా శిక్షణ పొందుతున్న దగ్గరి నుంచి ఆయన నాకు పరిచయమని పవన్ తెలిపారు. భోళా శంకర్‌లో కారుతో ఓ స్టంట్ చేసినందుకు అందుకున్న రూ.50 వేల పారితోషికాన్ని జనసేన పార్టీకి శ్రీబద్రి విరాళంగా ఇచ్చారని.. అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు పవన్.
పవన్ చేసిన సాయమే నిలబెట్టింది :
అనంతరం శ్రీబద్రి మాట్లాడుతూ.. తోటి మనిషికి సాయం చేయాలన్న మనస్తత్వం పవన్ కళ్యాణ్దన్నారు. 28 ఏళ్ల కిందట తనకు ఆయన సాయం చేశారని.. దాని వల్లే తాను స్టంట్ మ్యాన్ అయి, భార్యాబిడ్డలతో సంతోషంగా వున్నానని శ్రీబద్రి గుర్తుచేసుకున్నారు. తన చిన్న కుమార్తె అమెరికాలో చదువుకుంటోందని.. ఇదంతా పవన్ కళ్యాణ్ దయేనని, మీరు చేసే సాయం తనతో ఆగిపోకూడదని, ఎంతోమంది మీ వల్ల సాయం పొందుతున్నారని ఆయన వెల్లడించారు. పవన్ ముఖ్యమంత్రి అయి, తనలాంటి వాళ్లకు సాయం చేయాలని శ్రీబద్రి ఆకాంక్షించారు.
అక్టోబర్ 1 నుంచి నాలుగో విడత వారాహి విజయ యాత్ర :
కాగా.. అక్టోబర్ 1 నుంచి నాలుగో విడత వారాహి విజయ యాత్రను నిర్వహించనున్నారు పవన్ కల్యాణ్. కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఈ మేరకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సోమవారం వెల్లడించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన జనసేన నేతలతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అవనిగడ్డ నుంచి మచిలీపట్నం, పెడన, కైకలూరు మీదుగా యాత్ర సాగేల ప్రణాళిక సిద్ధమైంది. పూర్తి షెడ్యూల్‌ను తదుపరి సమావేశంలో ఖరారు చేయాలని నాదెండ్ల నిర్ణయించారు.