కళ్ళు చెదిరే ధరకు RRR ఆడియో రైట్స్!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ఆర్ఆర్ఆర్ షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీనితో చిత్ర యూనిట్ భారీ ప్రచార కార్యక్రమాలకు తెరతీశారు.

రాజమౌళ చిత్రం కావడం, ఎన్టీఆర్, రాంచరణ్ కలసి నటిస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్ర బిజినెస్ కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతోంది. తాజాగా ఈ చిత్ర ఆడియో హక్కులకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ప్రముఖ మ్యూజిక్ సంస్థలు లహరి, టి సిరీస్ ఆర్ఆర్ఆర్ ఆడియో హక్కులని దక్కించుకున్నాయి.

ఈ విషయాన్ని స్వయంగా లహరి, టి సిరీస్ ప్రకటించాయి. ఆర్ఆర్ఆర్ చిత్రం పై ఉన్న క్రేజ్ తో ఈ చిత్ర ఆడియో హక్కులని ఈ రెండు సంస్థలు దాదాపు 25 కోట్ల భారీ డీల్ తో దక్కించుకున్నట్లు సమాచారం.

ఇక ఫ్రెండ్ షిప్ డే ఆగష్టు 1న ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సాంగ్ షూటింగ్, రికార్డింగ్ ఇటీవలే పూర్తయింది. సంగీత దర్శకుడు కీరవాణి ఈ సాంగ్ కోసం అనిరుద్ ని రంగంలోకి దించిన సంగతి తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ ప్రచార కార్యక్రమాలు ఊహకు అందని విధంగా ఉండబోతున్నాయట. ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో, రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం కోసం దేశం మొత్తం సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అలియా భట్, అజయ్ దేవగన్, సముద్రఖని, ఒలీవియా మోరిస్, శ్రీయ శరన్ కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 13న ఆర్ఆర్ఆర్ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది.