చేయి వేస్తే షాకే..
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్ని చట్టాలొచ్చినా మహిళలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. మహిళలకు ఏమాత్రం భద్రత లేకుండా పోతోంది. దీంతో విసుగు చెందిన ఓ విద్యార్థిని ఇంట్లో ఉన్న వ్యర్థాలతో ఓ కీచైన్‌ను రూపొందించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌కు చెందిన పూజాపాటిల్ అనే విద్యార్థిని ఆపదలో ఉన్న ఆడవారి కోసం ఓ కీచైన్‌ను రూపొందించింది. మహిళపై ఎవరైనా దాడి చేస్తే ఆ కీచైన్ ద్వారా సదరు వ్యక్తికి కరెంటు షాక్ ఇచ్చి తప్పించుకోవచ్చు. థింకర్ ఇండియాలో భాగంగా పూజా ఈ పరికరాన్ని రూపొందించింది.
పూజ తయారు చేసిన కీచైన్.. ఓల్టేజ్ ఆంప్లిఫికేషన్ పద్ధతితో పని చేస్తుంది. దీనిలో ఉండే బ్యాటరీ ద్వారా విద్యుత్ సరఫరా అవుతుంది. మహిళలు ఇది తమ వద్ద ఉంచుకోవాలి. ఎవరైనా మీద చెయ్యి వేస్తే కీచైన్ బటన్‌ను నొక్కాలి. అంతే అవతలి వ్యక్తికి షాక్ తగిలి స్పృహను కోల్పోతాడు. ఈ కీచైన్ నుంచి 440 వాట్ల విద్యుత్ సరఫరా అవుతుంది. ఇంట్లో ఉండే వ్యర్థాలతో.. తన అన్న శివ సహకారంతో.. కేవలం 300 రూపాయల ఖర్చుతో ఈ కీచైన్‌ను రూపొందించినట్టు పూజాపాటిల్ తెలిపింది.
కీచైన్ విషయం తెలుసుకున్న థింకర్ ఇండియా వ్యవస్థాపకుడు దానిని పూజా పాటిల్ పేరు మీద పేటెంట్ తీసుకోనున్నట్టు వెల్లడించారు. ఈ కీచైన్‌ను మార్కెట్లోకి తీసుకు వచ్చేందుకు యూపీ ప్రభుత్వంతో పాటు, టెక్నికల్ సంస్థలతో సంప్రదింపులు జరుపుతామని ఆయన వెల్లడించారు. తాను రూపొందించిన కీచైన్ ప్రతి ఒక్క మహిళనూ చేరాలని పూజా పాటిల్ ఆకాంక్షిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments