నేటి నుంచి మరింత కఠినంగా లాక్డౌన్
Send us your feedback to audioarticles@vaarta.com
రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు, డీజీపీతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం లాక్డౌన్ విషయంలో మరింత కఠినంగా ఉండాలని ఆదేశించారు. గ్రామాల్లో సర్పంచ్‌లు, ఇతర ప్రజా ప్రతినిధులు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారని, నగరాల్లో, పట్టణాల్లో మాత్రం మరింత సమర్థవంతంగా అమలు కావాల్సి ఉందని అన్నారు. అలాగే కొన్ని జిల్లాల్లోనూ లాక్డౌన్ సరిగా అమలు కావడం లేదన్నారు. దీనిపై అందరూ దృష్టి పెట్టాలన్నారు. నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లో కరోనా కేసులు తగ్గడం లేదన్నారు.
వైద్య ఆరోగ్యశాఖ రిజ్వీ ఆయా జిల్లాలకు వెళ్లి పరిస్థితులను సమీక్షించాలని ఆదేశించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల దాకా సాధారణ కార్యకలాపాలకు వెసులుబాటు ఉంటున్నందున.. 10.10 గంటల తర్వాత పాస్‌హోల్డర్స్ తప్ప.. మరెవరూ రోడ్లపై కనిపించడానికి వీల్లేదన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఆర్థికంగా జరుగుతున్న నష్టం గురించి కూడా ఆలోచించకుండా లాక్డౌన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం నియమ నిబంధనల ప్రకారం లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాల్సిన బాధ్యత డీజీపీతో సహా కలెక్టర్లపై ఉందన్నారు.
అలాగే జిల్లాల్లో మందుల సరఫరా, ఆక్సిజన్ సరఫరా ఎలా ఉందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆరా తీశారు. తొలి ఫీవర్ సర్వేకు కొనసాగింపుగా.. రెండో విడత కూడా ఫీవర్ సర్వే చేపట్టాలన్నారు. బ్లాక్ ఫంగస్ రోగులకు అవసరమైన ఇంజక్షన్ల పంపిణీ జరగాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టాలని.. ప్రభుత్వాసుపత్రుల పరిశుభ్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందిని ప్రశంసించారు. కొవిడ్ ఆస్పత్రుల్లో సేవలందిస్తున్న అన్నిరకాల ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమస్యలను పరిష్కరించడానికి త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నామని తెలిపారు. వైద్య సిబ్బంది ఇదే స్ఫూర్తిని కొనసాగించాలన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments