BRS MLC: ట్యాపింగ్ కేసులో తనపై కట్టుకథలు అల్లుతున్నారు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
Send us your feedback to audioarticles@vaarta.com
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ రాధాకిషన్ రావు ఇచ్చిన రిమాండ్ రిపోర్టులో తన పేరు బయటకు రావడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మెదక్ ఎంపీ అభ్యర్థి చల్లా వెంకట్రామిరెడ్డి స్పందించారు. తనను రాజకీయంగా ఎదుర్కునే సత్తా లేక మీడియాకు లీకులు ఇచ్చి, తప్పుడు వార్తలు రాయించి లబ్ధి పొందాలని బీజేపీ, కాంగ్రెస్ కలిసి ప్రయత్నిస్తున్న తీరు సిగ్గు చేటు అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో పోటీ కూడా చేయని తనను ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నట్టు కథలు అల్లి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించి రెండు పార్టీలు చేతులు కలిపి తనను ఓడించాలని దుష్టపన్నాగం పన్నుతున్నాయని ఆయన మండిపడ్డారు.
ప్రభుత్వ ఉద్యోగిగా, కలెక్టర్‌గా ప్రజలకు తాను నిజాయతీగా సేవలు అందించానన్నారు. రాజకీయ నాయకుడిగా ప్రజలకు మరింత సేవ చేసే ఉద్దేశ్యంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినట్లు వివరించారు. ప్రతి నియోజకవర్గంలో ఫంక్షన్ హాల్ నిర్మించి సేవలు అందిస్తానని హామీ ఇచ్చానని గుర్తు చేశారు. తాను ఓట్ల కోసం అబద్ధాలు చెప్పే వ్యక్తిని కాదని.. తనకు ప్రజల అభిమానం ఉందని ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా గెలుపు తనదేనని ఆయన ధీమా వ్యక్తంచేశారు. కాగా రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్డులో వెంకట్రామిరెడ్డి పేరు తెరపైకి వచ్చింది.
ఈ రిమాండ్ రిపోర్డులో ఏం ఉందంటే.. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా.. ఇతర పార్టీల నేతలకు సంబంధించిన డబ్బును పట్టుకోవడానికి ఫోన్ ట్యాపింగ్‌ను రాధాకిషన్‌రావు ఆయుధంగా వినియోగించినట్లు తేలింది. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా డబ్బు తరలించే వ్యవహారంలోనూ ఆయన కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. తన చిన్ననాటి మిత్రుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి చెందిన సొమ్మును ఎక్కువగా తరలించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టారు. సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ ఎస్సైని ఉపయోగించి డబ్బులను రవాణా చేసినట్లు తెలిసింది. ఎమ్మెల్సీ డబ్బులకు ఎస్కార్ట్ ఇచ్చి రాధాకిషన్ రావు డెలివరీ చేయించారు. ఎవరికీ అనుమానం రాకుండా పోలీస్ వాహనాల్లోనే ఆ డబ్బును తరలించారు.
పోలీసు శాఖకే చెందిన ఓ బొలెరో వాహనంలో ఒక వ్యాపారవేత్త నుంచి డబ్బులు తీసుకుని సదరు నేతలకు అందజేశారు. ఈ డబ్బు రవాణాలో రిటైర్డ్ ఎస్పీ దివ్య చరణ్ రావు సైతం కీలక పాత్ర పోషించినట్లు విచారణలో వెల్లడైంది. సోమాజిగూడ, మలక్‌పేటలోని ఒక ప్రైవేటు ఆసుపత్రి నుంచి డబ్బులను ఆయన తరలించినట్లు తెలిసింది. అనంతరం ఆ డబ్బులను ఎస్సై బీఆర్ఎస్ నేతలకు ఇచ్చినట్లు సమాచారం. ప్రభాకర్ రావు ఆదేశాలతో రాజకీయ నాయకులపై నిఘా కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రణీతరావు ఇచ్చే సమాచారంతో నిఘా పెట్టారని రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు వెల్లడించారు. దీంతో రాధా కిషన్ రావుకి సహకరించిన ఎస్సైతో పాటు మాజీ ఎస్పీని విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ రిమాండ్ రిపోర్టుల ఆధారంగా త్వరలోనే కొందరు రాజకీయ ప్రముఖులకు పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని.. ఇందులో మాజీ మంత్రులు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments