‘మూత్రం’ స్టోర్ చేయండి.. వాటాన్ ఐడియా సర్ జీ!
- IndiaGlitz, [Tuesday,March 05 2019]
ఇదేంటి టైటిల్ చూడగానే ఆశ్చర్యపోతున్నారా..? అవును మీరు వింటున్నది నిజమే. ఈ మాట అన్నది ఎవరో కాదండోయ్.. మన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. సోమవారం నాడు నాగ్‌పూర్‌లో నిర్వహించిన యువ సృజనాత్మక ఆవిష్కరణలు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సంర్భంగా ఓ ఆసక్తికర ప్రతిపాదన చేశారు. మన దేశం మూత్రాన్ని దాచిపెట్టుకోగలిగితే.. విదేశాల నుంచి ఎరువులను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మానవ మూత్రం జీవ ఇంధనంగా ఉపయోగపడుతుంది. అందులో సల్ఫేట్, నైట్రోజన్ ఉంటాయి. మానవ వ్యర్థాల నుంచి జీవ ఇంధనాలను ఎలా ఉపయోగించుకోవచ్చో చెప్పడానికి ఇదే ఉదాహరణ అని ఆయన చెప్పుకొచ్చారు.
అంతటితో ఆగని ఆయన.. ఇప్పటికే విమానాశ్రయాల్లో మూత్రాన్ని స్టోర్ చేయాల్సిందిగా తాను కోరినట్లు తెలిపారు. మనదేశం ప్రస్తుతం విదేశాల నుంచి యూరియాను దిగుమతి చేసుకుంటోందని గుర్తు చేసిన ఆయన... ఒక్కసారి దేశం మొత్తం మూత్రాన్ని స్టోర్ చేయడం మొదలుపెడితే యూరియాను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదని చెప్పుకొచ్చారు. మూత్రం ఒక శక్తివంతమైన ద్రవం, ఏదీ వృథాగా పోదని గడ్కరీ చెప్పుకొచ్చారు. అంతేకాదు.. మనిషి వెంట్రుకల నుంచి అమినో యాసిడ్స్ ఉత్పత్తి అవుతుందని.. దాన్ని ఎరువుగా ఉపయోగించుకోవచ్చు అని గడ్కరీ ఆసక్తికర విషయాలు కార్యక్రమంలో వివరించారు. సో.. మంత్రి గారి మాటలు జనాలు ఏ మాత్రం చెవిన వేసుకున్నారో.. అనేది తెలియాల్సి ఉంది.