ఎల్లుండి 9 నిమిషాలు నాకివ్వండి : మోదీ
- IndiaGlitz, [Friday,April 03 2020]
కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా ఇప్పటికే జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఓ సారి పిలుపునిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా మరోసారి దేశ ప్రజలకు వెరైటీ పిలుపునిచ్చారు. ఈ మహమ్మారిపై పోరులో భారతజాతి మొత్తం ఏకతాటిపై ఉందన్న విషయాన్ని మరోసారి తెలియజేయాలని మోదీ తెలిపారు. ఇవాళ ఉదయం వీడియో సందేశాన్ని ఇచ్చిన ఆయన.. ఏప్రిల్ 5వ తేదీన ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో 9 నిమిషాల సమయాన్ని ప్రతి ఒక్కరూ కేటాయించాలని సూచించారు. రాత్రి 9 గంటలకు ఇళ్లలోని విద్యుత్ లైట్లను అన్నిటినీ ఆర్పివేయాలని, ఆపై వీధుల్లోకి రాకుండా, తలుపుల వద్ద కానీ, బాల్కనీలలో కానీ నిలబడి, వీలైనన్ని ఎక్కువ దీపాలను, కొవ్వొత్తులను వెలిగించాలని మోదీ కోరారు. లేకపోతే, సెల్ ఫోన్లలోని ఫ్లాష్ లైట్లను, టార్చిలైట్లను వెలిగించాలని ఆయన కోరారు. తద్వారా జాతి సంకల్పం ఒకటేనన్న సందేశాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలని విజ్ఞప్తి చేశారు.
ఇలా జయించగలం..
‘కరోనాపై యుద్ధం చేస్తున్నవారందరికీ కృతజ్ఞతలు. లాక్‌డౌన్‌కు 9రోజులు పూర్తి..వచ్చే 11 రోజులూ అత్యంత కీలకం. జనతా కర్ఫ్యూతో భారతీయులు తమ శక్తిసామర్ధ్యాలు చాటారు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్ని మన బాటలోనే నడుస్తున్నాయి. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంటే కరోనాను జయించగలం’ అని మోదీ పిలుపునిచ్చారు.