ఆర్బీఐ ప్రకటనతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
- IndiaGlitz, [Friday,May 22 2020]
కరోనా కష్టకాలంలో ఆర్బీఐ పలు కీలక ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం నాడు మీడియా మీట్ నిర్వహించిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్న వారికి, క్రెడిట్ కార్డు వినియోగదారులకు తియ్యటి శుభవార్త చెప్పారు. ముఖ్యంగా 40 బేసిస్ పాయింట్ల మేర కోత విధించడంతో రెపో రేటు 4 శాతానికి దిగొచ్చింది. తాజా ప్రకటనతో రుణ రేట్లు మరింత దిగిరానున్నాయి. రెపో రేటు తగ్గింపు నేపథ్యంలో రివర్స్ రెపో రేటు ఇదివరకు 3.75 ఉండగా ప్రస్తుతం 3.35 శాతానికి దిగొచ్చినట్లయ్యింది. మరోవైపు.. ఇదివరకే మారటోరియం ప్రకటించిన ఆర్బీఐ తాజాగా దాన్ని మరో మూడు నెలలు పెంచింది. ఇలా ఇవాళ ఆర్బీఐ చేసిన కీలక ప్రకటనలతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి.
ఆర్బీఐ ప్రకటనతో పరిస్థితి ఇదీ..
సెన్సెక్స్ 350 పాయింట్లకు పైగా నష్టపోయింది. మరోవైపు బ్యాంకింగ్ రంగం కూడా భారీగానే నష్టాలు చవిచూసింది. అంతేకాదు.. రూపాయి విలువ 23 పైసలు నష్టపోయి 75.84కి చేరింది. ముఖ్యంగా 2021లోనూ జీడీపీ తిరోగమనంలోనే కొనసాగే అవకాశం ఉన్నట్లు ఆర్బీఐ గవర్నర్ చేసిన ఈ ప్రకటన స్టాక్ మార్కెట్లను కుదేలు చేసింది. ఈ ప్రకటన ముదుపర్లను కలవరపాటుకు గురిచేసింది. మొత్తానికి చూస్తే వడ్డీ రేట్ల తగ్గింపు అనేది సూచీల సెంటిమెంట్‌ను గట్టిగా దెబ్బతీసిందని చెప్పుకోవచ్చు.
ఇవాళ ఉదయం ఒకానొక దశలో కోలుకుని స్వల్ప లాభాల్లో ప్రయాణించినప్పటికీ 11 గంటలకు మాత్రం సెన్సెక్స్ 416 పాయింట్లు నష్టపోయి 30,516 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 123 పాయింట్లు దిగజారి 8,982 వద్ద ట్రేడ్ అవుతోంది. ఉదయం నుంచి నష్టాలతో ప్రారంభమై ఒక దశలో కోలుకున్నప్పటికీ ఆర్బీఐ ప్రకటనతో స్టాక్స్ భారీగా పడిపోయాయి. అయితే ఈ మూడు నెలలు కూడా స్టాక్స్ పరిస్థితి ఇలానే ఉండొచ్చని ఆర్థిక నిపుణులు అంచనాలు వేస్తున్నారు.