రేసు గుర్రాల్లా దూసుకుపోయిన స్టాక్‌మార్కెట్లు

  • IndiaGlitz, [Tuesday,April 16 2019]

దేశీయ స్టాక్‌మార్కెట్లు నాలుగో రోజు కూడా లాభాలతో రేసు గుర్రాల్లా దూసుకుపోయాయి. సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ పాజిటివ్‌గా ముగియడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడిందని చెప్పుకోవచ్చు. మరోవైపు విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తడంతో పాటు ఈ ఏడాది మంచి వర్షపాతం నమోదవుతుందనే వాతావరణ శాఖ ప్రకటన నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మరింత బలపడిందని నిపుణులు చెబుతున్నారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు స్థాయిలో క్లోజ్ అయ్యాయి. కాగా ఇవాళ ట్రేడింగ్‌ ప్రారంభంలోనే నిఫ్టీ గత గరిష్ట రికార్డ్‌ 11,761ను అధిగమించి 11800 స్థాయిని తాకడం విశేషం. అటు సెన్సెక్స్‌ సైతం 450 పాయింట్లు జంప్‌ చేసింది. కాగా.. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 370 పాయింట్లు లాభపడి 39,276కు చేరుకుంది. నిఫ్టీ 97 పాయింట్లు పెరిగి 11,787కు ఎగబాకింది.

ఎవరికి లాభం.. ఎవరికి నష్టం!

ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.96%), ఐసీఐసీఐ బ్యాంక్ (3.58%), ఓఎన్జీసీ (2.49%), ఎల్ అండ్ టీ (1.82%), మారుతి సుజుకి (1.74%) తో లాభాల్లో ఉన్నాయి. మరోవైపు ఎస్ అండ్ పీ సెన్సెక్స్‌లో కేవలం మూడు కంపెనీలు... పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-0.63%), ఇన్ఫోసిస్ (-0.39%), టాటా మోటార్స్ (-0.22%) జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు 18శాతం మాత్రమే నష్టాల్లో ముగిశాయి.