ప్రభుత్వ లాంఛనాలతో లతా మంగేష్కర్ అంత్యక్రియలు.. ముంబైకి ప్రధాని మోడీ
- IndiaGlitz, [Sunday,February 06 2022]
అనారోగ్యంతో కన్నుమూసిన దిగ్గజ నేపథ్య గాయనీ లతా మంగేష్కర్ అంత్యక్రియలు ఆదివారమే జరగనున్నాయి. గాన కోకిల ఇక లేరని తెలుసుకున్న సంగీత ప్రియులు శోక సంద్రంలో మునిగిపోయారు. సామాన్యులతో పాటు సినీ, రాజకీయ , వ్యాపార, క్రీడా ప్రముఖులు లతా మంగేష్కర్ మరణంపై సంతాపం తెలుపుతున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ముంబైలోని శివాజీ పార్క్‌లో లతా మంగేష్కర్ అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. లతా అంత్యక్రియలకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరుకానున్నట్లు సమాచారం.
ఆయన సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్తారని.. లతా మంగేష్కర్ పార్థివదేహానికి నివాళులు అర్పించి.. అంత్యక్రియల్లో పాల్గొంటారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. లతా మంగేష్కర్ మృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. ఈ రెండు రోజులూ దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర భవనాలపై ఉన్న జాతీయ జెండాను అవనతనం చేస్తారు. ఈ మేరకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
కాగా.. కరోనా పాజిటివ్‌గా తేలడంతో లతా మంగేష్కర్‌ను జనవరి 8న ముంబైలోని బీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. అప్పటినుంచి ఐసీయూ (ఇంటెన్సివ్ కేర్ యూనిట్)లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. అభిమానులు, సినీ ప్రముఖులు, దేశ ప్రజల కోసం ఎప్పటికప్పుడు లతాజీ ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను హాస్పిటల్ యాజమాన్యం వెల్లడిస్తూనే ఉంది. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమె కరోనా నుంచి కోలుకొన్నట్లు వైద్యులు, కుటుంబసభ్యులు ప్రకటించారు. అయితే నిన్న లతాజీ ఆరోగ్యం మరోసారి క్షీణించింది. ఆమెను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం లతా మంగేష్కర్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు.