Dilraju : పొలిటికల్‌గా ఆఫర్లు వస్తున్నాయి.. కానీ : రాజకీయ రంగ ప్రవేశంపై దిల్‌రాజు క్లారిటీ

  • IndiaGlitz, [Wednesday,April 05 2023]

దిల్‌రాజు.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. డిస్ట్రిబ్యూటర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆయన బడా ప్రొడ్యూసర్‌గా ఎదిగారు. ప్రస్తుతం టాలీవుడ్‌ని కనుసైగతో శాసించగల నలుగురిలో దిల్‌రాజు కూడా ఒకరు. చిత్ర నిర్మాణంతో పాటు పలు వ్యాపారాల్లో వందల కోట్లు సంపాదించిన దిల్‌రాజు మనసు రాజకీయాలవైపు మరలుతోందంటూ ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన దిల్‌రాజుకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని బీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ నేతలతో సత్సంబంధాలు వున్నాయి. దీంతో తెలుగు నాట ఎన్నికల సీజన్ వచ్చినప్పుడల్లా దిల్‌రాజు పేరు తెరపైకి వస్తోంది. రాజుగారు ఫలానా పార్టీ తరపున పోటీ చేస్తారని , ఆ పార్టీ టికెట్ ఇవ్వబోతోందని.. లేదంటే ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ వస్తుందని పలుమార్లు ప్రచారం జరిగింది. కానీ ఇవన్నీ గాలివార్తలేనని తేలిపోయింది.

సామాజిక కార్యక్రమాలు చేస్తోన్న దిల్‌రాజు :

తాజాగా గత కొన్నిరోజులుగా దిల్‌రాజు పేరు రాజకీయాల్లో వినిపిస్తోంది. ఆయన త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేస్తారంటూ మీడియాలో విస్తృతంగా కథనాలు వస్తున్నాయి. ఇక ఇటీవల ఆయన నిర్మించిన బలగం సినిమా ఫంక్షన్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హాజరైన నాటి నుంచి ఈ వార్తలు మరింత ఎక్కువయ్యాయి. దీనికి తోడు తెలంగాణ పల్లెల్లో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వుండటం, నిజామాబాద్‌లో అద్భుతమైన వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించడం ద్వారా దిల్‌రాజు ప్రజలకు మరింత చేరువవుతున్నారని.. ఇదంతా రాజకీయాల కోసమేనంటూ ప్రచారం జరుగుతోంది. అయినప్పటికీ.. దిల్‌రాజు గట్టిగా తలచుకోవాలే గానీ ఆయనకు ఏ పార్టీలోనైనా టికెట్ గ్యారెంటీ.

ఇండస్ట్రీలోనే నన్ను విమర్శిస్తే తట్టుకోలేను :

ఈ వార్తల నేపథ్యంలో దిల్‌రాజు స్పందించారు. రాజకీయాల్లోకి వెళ్లే అంశంపై తనకే స్పష్టత లేదన్నారు. చిత్ర పరిశ్రమలోనే తనపై ఎవరైనా కామెంట్స్ చేస్తేనే తాను తట్టుకోలేనని.. రాజకీయాల్లో తన వల్ల కాదని దిల్‌రాజు పేర్కొన్నారు. అయితే తనకు పొలిటికల్‌గా ఆఫర్లు చాలా వున్నాయన్నారు. అటు గ్రామాల్లో బలగం చిత్ర ప్రదర్శనలపై దిల్‌రాజు స్పందించారు. చిత్ర ప్రదర్శనలను తాము అడ్డుకోవడం లేదని.. సినిమా ఏ రకంగా చూసినా తమకు ఆనందమేనని, ఇలాంటి ప్రదర్శనల వల్ల ఓటీటీ సంస్థతో వచ్చే ఇబ్బందులను తామే పరిష్కరించుకుంటామని దిల్‌రాజు పేర్కొన్నారు. గ్రామాల్లో బలగం చూడాలనుకునేవారికి తామే దగ్గరుండి ఏర్పాట్లు చేస్తామన్నారు.