Vishal:రాజకీయాల్లోకి రావడంపై స్టార్ హీరో విశాల్ క్లారిటీ
- IndiaGlitz, [Wednesday,February 07 2024]
తమిళనాడులో రాజకీయాలు హాట్‌టాపిక్‌గా మారుతున్నాయి. ఇప్పటికే స్టార్ హీరో దళపతి విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు కొత్త పార్టీ కూడా ప్రకటించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించడమే తన లక్ష్యమని తెలిపారు. తాజాగా ఆయనకు పోటీగా మరో హీరో విశాల్ కూడా పార్టీ పెట్టబోతున్నట్లు వార్తలు ఊపందుకున్నాయి. ఈ వార్తలపై విశాల్ స్పందించారు. తాను రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. రాజాకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు లేదని పేర్కొన్నారు.
తనకు ఇంత గుర్తింపు, హోదా ఇచ్చిన ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. సినీరంగంలో ఉంటూ సేవా కార్యక్రమాలను కూడా చేస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే దేవీ ఫౌండేషన్ ద్వారా ఎందరినో ఆదుకున్నానని..అనేక మంది విద్యార్థులను తాను చదవిస్తున్నానని.. రైతులను ఆదుకున్నానని తెలిపారు. తాను లాభాలను ఆశించి ఏ పనిచేయనని చెప్పకొచ్చారు. ఇప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని.. కాలం నిర్ణయిస్తే ప్రజల కోసం తప్పకుండా పోరాడుతా అని వెల్లడించారు .
వాస్తవంగా విశాల్ ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు. నడిగర్ సంఘం ఎన్నికల్లో ఆయన పోటీ చేసి సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఆయన ప్యానల్ తరఫున పోటీ చేసిన నాజర్ ప్రెసిడెంట్ అయ్యారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేశారు. అయితే అది రిటర్నింగ్ అధికారులు ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు. ఇక ఇటీవల ఏపీ రాజకీయాల్లో వస్తారనే ప్రచారం జరిగింది. కుప్పం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ తరపున పోటీ చేయనున్నారనే వార్తలు వచ్చాయి. ఆ వార్తలను కూడా విశాల్ ఖండించారు.
తమిళ నటులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత వంటి దిగ్గజ నేతలు చిత్రపరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. అనంతరం ఏకంగా ముఖ్యమంత్రులుగా ఏళ్ల పాటు పాలించారు. అయితే వారి మరణం తర్వాత ఇప్పటివరకు ఏ సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి కాలేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని జోరుగా ప్రచారం జరిగింది. ఓ దశలో ఆయన కూడా సొంతంగా పార్టీ పెట్టాలని భావించారు. అయితే ఏమైందో ఏమో తాను రాజకీయాల్లోకి రావడం లేదని తేల్చేశారు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక లోకనాయకుడు కమల్ హాసన్ పార్టీ పెట్టినా అక్కడి రాజకీయాల్లో తనదైన ముద్ర వేయలేకపోయారు. కెప్టెన్ విజయ్ కాంత్ పార్టీ పెట్టిన ఆశించిన రీతిలో పెద్ద నాయకుడిగా ఎదగలేకపోయారు.
அன்புடையீர் வணக்கம் pic.twitter.com/WBkGmwo2hu
— Vishal (@VishalKOfficial) February 7, 2024