పదో తరగతి పరీక్షల రద్దు.. ఇంటర్ వాయిదా..
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది కూడా పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సీబీఎస్‌ఈ పరీక్షలు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో కూడా పదో తరగతి పరీక్షలను రద్దు చేసే దిశగా అడుగులు పడ్డాయి. ఇక ఇంటర్మీడియట్ పరీక్షల విషయానికి వస్తే.. వాటిని రద్దు చేసే ఆలోచన అయితే చేయలేదు కానీ వాయిదా వేస్తున్నట్టు మాత్రం ప్రభుత్వం ప్రకటించింది.
పదో తరగతి పరీక్షల రద్దుకు సంబంధించిన ఫైల్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పంపించారు. ఈ ఫైల్‌పై ముఖ్యమంత్రి సంతకం చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో 5 లక్షల 35 వేల మంది టెన్త్ విద్యార్థులు ఉన్నారు. కాగా, వీరందరినీ గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పైతరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు 4 లక్షల 58 వేల మంది ఉన్నారు. కరోనా ఉధృతి తగ్గాక వీరికి పరీక్ష నిర్వహించే అవకాశాలున్నాయి. ఇకపోతే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించింది. వీటిపై పునరాలోచించి పరీక్షలను వాయిదా వేయడంపై నిర్ణయం తీసుకోనుందని సమాచారం.
నీట్-పీజీ మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలు వాయిదా..
నీట్-పీజీ మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. నిజానికి ఈ పరీక్షలు ఈ నెల 18వ తేదీన జరగాల్సి ఉంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ గురువారం ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ పరీక్షను నిర్వహించే తేదీని తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments