ఐదేళ్ళ సమయం పడుతుందని తెలుసుంటే 'బాహుబలి' మొదలు పెట్టే వాళ్లమే కాదు - ఎస్.ఎస్.రాజమౌళి

  • IndiaGlitz, [Thursday,April 27 2017]

ఆర్కా మీడియా వర్క్స్‌ బ్యానర్‌పై ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రానా ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం 'బాహుబలి 2'. బాహుబలి ది బిగినింగ్‌కు కొనసాగింపుగా ఏప్రిల్‌ 28న విడుదలవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సందర్భంగా దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళితో ఇంటర్వ్యూ...

బాహుబలి ప్రభంజనం చూస్తుంటే ఎలా ఉంది?

ఏ సినిమా అయినా భారీ అంచనాలతో వచ్చినా సామాన్య ప్రేక్షకుడి నుంచి అందరికీ టికెట్ల కోసం డిమాండ్‌ ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే దీనికి కొంచెం ఎక్కువగా ఉంది. ఇదంతా చూస్తుంటే ఓ దర్శకుడిగా గర్వంగా ఉంది. కొంత భయం, మరికొంత బాధ్యత కూడా ఉంటుంది. ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేయాలనే విషయం గుర్తుకు పెట్టుకుని చేస్తాను.

సినిమా రిలీజ్‌కు దగ్గరవుతున్న కొద్ది టెన్షన్‌ పెరుగుతుందా?

సినిమాకోసం వర్క్‌ చేస్తున్నంతసేపూ సినిమా ఎగ్జయిట్‌మెంట్‌ ఉండేది. పని పూర్తయ్యాక టెన్షన్‌ మొదలవుతుంది. మా పనులన్నీ పూర్తయ్యాయి కాబట్టి ఇప్పుడిప్పుడే ఉత్కంఠ మొదలైంది. ఇప్పుడు కాస్తా వర్క్‌ ఉంటే బావుణ్ణే అందరూ కలిసి చేసేవాళ్ళం కదా అనే బాద కూడా ఉంది.

'బాహుబలి 2'పై ఎక్స్‌పెక్టేషన్స్‌ పెరిగిన తర్వాత కథలో ఏమైనా మార్పులు చేశారా?

నా దృష్టిలో బాహుబలి ఒక సినిమాయే. ఈ కథని ఒక భాగంలో చెప్పలేం కాబట్టి రెండు భాగాలుగా తీశాం కాబట్టి కథలో మార్పులు చేర్పులు చేయలేదు. అయితే కమర్షియల్‌ యాంగిల్‌లో ఆలోచించి ఆ ఎలిమెంట్స్‌ను యాడ్‌ చేశాను.

బాహుబలి అనే ఐదేళ్ళ ప్రయాణంలో మీకు మద్ధతుగా నిలిచింది ఎవరు?

ముందు నాకు మద్ధతుగా నిలబడింది నా నిర్మాతలు. నన్ను నమ్మి కోట్ల రూపాయలను ఖర్చు పెట్టారు. తర్వాత నా కుటుంబం నేనేదో కల కంటున్నాను. దాన్ని నిజం చేద్దామని అందరూ కష్టపడ్డారు. నన్ను కాపాడుకుంటూ వచ్చారు. నా చుట్టూ నా కుటుంబం లేకపోతే ఇంత పెద్ద భారాన్ని భుజాలపై వేసుకొనేవాడ్ని కాదేమో. వాళ్లే నాబలం, బలగం అయ్యారు. మూడోది ప్రభాస్‌. నీ రేంజ్‌ ఇది కాదు అంటూ నాలో ఎనర్జీని నింపాడు. ఇలా అందరి సహకారంతోనే ఈ మహా యజ్ఞం పూర్తయ్యింది.

ఓ సినిమా కథని ప్రేక్షకులు ఇంతకాలం గుర్తుపెట్టుకొంటారని ఎలా భావించారు?

నిజానికి ఈ బాహుబలి జర్నీకి ఐదేళ్ళ సమయం పడుతుందని ముందుగా తెలియదు. తెలిస్తే స్టార్ట్‌ చేసేవాళ్ళం కాదు. సినిమా మొత్తాన్ని తీసేసి ఫస్ట్‌ పార్ట్‌ రిలీజ్‌ చేసిన ఆరు నెలల వ్యవధిలో సెకండ్‌ పార్ట్‌ను విడుదల చేస్తామని అనుకున్నాం. కానీ తొలి భాగం పూర్తయ్యేసరికే డబ్బులన్నీ అయిపోయాయి. దాంతో రెండో భాగం ఆలస్యమైంది. ఇదంతా మార్కెటింగ్‌ వ్యూహాలు అనుకొంటున్నారు గానీ, నిజానికి మేమేం ఇది ప్లాన్‌ చేయలేదు. రంగంలోకి దిగాకే తెలిసింది. ఇక వెనక్కి తిరిగిరాలేం కదండీ, అందుకే ముందుకు వెళ్లాం. ఈ చిత్రం కోసం మంచి నటీనటులు, మంచి సాంకేతిక బందం, మంచి నిర్మాతలు కుదిరారు. అందరం ఒక కుటుంబంలా కలిసిపోయాం. దాంతో ఎప్పుడూ ఈ సినిమా నాకు బరువుగా అనిపించలేదు.

బాహుబలి సినిమా మీకు ఎలాంటి సంతృప్తినిచ్చింది?

ఒక కథకుడిగా 'బాహుబలి' బాగా సంత ప్తినిచ్చిన చిత్రం. ఇంతకుముందు చేసిన ప్రతి సినిమాలోనూ కొన్ని పాత్రలపై మాత్రమే ద ష్టి పెట్టినట్టు అనిపించేది. చాలా వరకు కథంతా కథానాయకుడి కోణంలోనే సాగేది. ఈ సినిమాలో ప్రతి పాత్ర కూడా కీలకమైనదే. నాకు ఇష్టమైన హీరోయిజాన్ని చూపిస్తూనే, అన్ని కోణాల్లోనూ సంతృప్తికరంగా చిత్రాన్ని తీర్చిదిద్దిన అనుభూతి కలిగింది.

ప్రాంతీయ చిత్రాలంటే ఉత్తరాది వాళ్లకు చిన్నచూపు అంటుంటారు. మీరు ఏకీభవిస్తారా?

ఈ వ్యాఖ్య పూర్తిగా నిజం కాదు. మనం కూడా అక్కడి నుంచి వస్తున్న ప్రతి సినిమానీ హిట్‌ చేయడం లేదు కదా? తెలుగులో మార్కెట్‌ కావాలనుకొంటే వాళ్లు ఇక్కడికి వచ్చి, పబ్లిసిటీ పెంచి నానా రకాలుగా కష్టపడతారు. అలా వాళ్ల సినిమాలు మనకు అలవాటయ్యాయి. అలా మనం వెళ్లి చేసింది లేదు. 'శివ' తరవాత హిందీలో తెలుగు సినిమాలకు మంచి మార్కెట్‌ ఏర్పడింది. ఒకప్పుడు విజయశాంతిగారి సినిమాలు తమిళంలో బాగా ఆడేవి. 'శంకరాభరణం' లాంటి క్లాసిక్‌ చిత్రాలు నేరుగా విడుదలై బాగా ఆడాయి. మనం ఆ మార్కెట్‌ ని నిలుపుకోలేకపోయాం. కథ బాగుంటే ఎవరైనా ఆదరిస్తారు. 'ఈగ' కథని బాగా నమ్మాను. తమిళంలో బాగా ఆడింది. మలయాళంలోనూ మంచి విజయం సాధించింది. బాలీవుడ్‌లో మాత్రం సరిగా వర్కవుట్‌ కాలేదు. 'ఈగ' ఆడలేదు కదా, అని 'బాహుబలి'ని అక్కడ విడుదల చేయకపోతే ఈ స్థాయి వసూళ్లు దక్కేవి కావు.

'బాహుబలి: ది కన్‌క్లూజన్‌' క్లైమాక్స్‌లో ఏమైనా ట్విస్ట్‌ ఇచ్చారా?

లేదండీ.. కథని అక్కడితో ముగించేశాం.

తదుపరి చిత్రం ..?

ఇంకా ఏదీ అనుకోలేదు. సినిమా విడుదలైన తర్వాత హాలీడే ట్రిప్‌కు వెళ్ళి వచ్చిన తర్వాత ఏం చేయాలనే దాన్ని గురించి ఆలోచిస్తాను.